లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహారాజా జట్టు బోణీ కొట్టింది. గురువారం ఆసియా లయన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6వికెట్ల తేడాతో ఇండియా మహారాజాస్ ఘన విజయం సాధించింది. మహారాజా విజయంలో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించారు. యూసుఫ్ కేవలం 40 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లయన్స్ ఆదిలోనే ఓపెనర్ దిల్షాన్ వికెట్ కోల్పోయింది. అనంతరం తరంగ, ఆక్మల్ లయన్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తరంగ 46 బంతుల్లో 66 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచారు. చివర్లో కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ మెరుపులు మెరిపించడంతో లయన్స్ 175 పరుగులు సాధించింది.
ఇక మహారాజా బౌలర్లలో మన్ ప్రీత్ గోనీ మూడు వికెట్లు పడగొట్టగా, ఇర్ఫాన్ పఠాన్ రెండు వికెట్లు సాధించారు. ఇక 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజా ఆదిలోనే బద్రీనాథ్, స్టువర్ట్ బిన్నీ వికెట్లను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ మహారాజా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. యూసుఫ్ పఠాన్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. వీరిద్దరూ కలిసి 116 పరుగుల బాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. 80 పరుగులు చేసిన యూసుఫ్ అనూహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కాగా కైఫ్ 42 పరుగులతో రాణించాడు. ఇక చివర్లో ఇర్ఫాన్ పఠాన్ మెరుపులు మెరిపించడంతో ఇండియా మహారాజా లక్ష్యాన్ని సూనయాసంగా చేధించింది.