బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన జొమాటో

బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన జొమాటో

ఫుడ్ ఆగ్రిగేటర్ జొమాటో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెలలోనే ఐపీవోకు వస్తున్న జొమాటో టెక్నాలజీ రిసెర్చర్లు, ఎథికల్ హ్యాకర్లకు ఒక సువర్ణావకాశాన్ని ప్రకటించింది. ఐపీవో ప్రమోషన్‌తోపాటు, తమ యాప్‌లో సెక్యూరిటీ లోపాలకు చెక్‌పెట్టేలా ఈ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది.

జొమాటో వెబ్‌సైట్‌లో కానీ, యాప్‌లో కానీ బగ్స్ కనిపెడితే 4,000 డాలర్లు (దాదాపు రూ.3 లక్షలు) గెలుచుకోవచ్చని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. “జొమాటో బగ్ బౌంటీ ప్రోగ్రామ్’’లో సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలను గుర్తించిన వారికి ఈ రివార్డును ఇవ్వనుంది. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ జూలై 8న అధికారికంగా ప్రకటించింది.

బగ్స్‌ తీవ్రతను బట్టి, బహుమతి రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకూ ఉంటుందని జొమాటో సెక్యూరిటీ ఇంజనీర్‌ యష్‌ సోధా ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సోధా కోరారు.

ఫేస్‌బుక్‌ ,గూగుల్‌ లాంటి దిగ్గజ సంస్థలు, టెక్ ఆధారిత ప్లాట్‌ఫాంలలో బగ్‌లు,సెక్యూరిటీ సమస్యలు గుర్తించిన వారికి రివార్డులు ప్రకటించడం మామమూలే. ఇందులో భాగంగానే జొమాటలోతాజాగా ఈ బహుమతిని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్‌ (సీవీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేసింది.

ఈ స్కోరు ఆధారంగా తుది బహుమతి విలువను సంస్థ నిర్ధారించనుంది. తీవ్రమైన హాని కలిగించే బగ్‌ను గుర్తించిన వారికి ఈ స్కోర్ 10గా ఉంటుంది. తద్వారా 4,000 డాలర్లు గెల్చుకోవచ్చు. ఈ స్కోరు 9.5గా ఉంటే.. రివార్డు 3,000 డాలర్ల వరకు ఉంటుంది. సో.. ఔత్సాహికులూ.. హ్యాపీ హ్యాకింగ్‌.