ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, జొమాటో కీలక వ్యవహారాలన్నీ చూసుకునే గౌరవ్ గుప్తా(38).. కంపెనీని వీడినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియా హౌజ్‌లలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ పరిణామంతో జొమాటో షేర్లు స్వల్ఫంగా పతనం అయ్యాయి.
ఫుడ్ టెక్ ప్లాట్‌ఫామ్ అయిన జొమాటోలో కీలక నిర్ణయాల నుంచి, ఐపీవోకి వెళ్లడం, ఇన్వెస్టర్లతో చర్చలు, మీడియాతో ఇంటెరాక్షన్ లాంటి వ్యవహారాలన్నీ గౌరవ్ గుప్తానే ఇంతకాలం చూసుకున్నారు. ఇదిలా ఉంటే జొమాటో ఐపీవో వెళ్లిన రెండు నెలల తర్వాత.. నిత్యావసర సరుకుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలోనే గౌరవ్ బయటకు వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, గౌరవ్ జొమాటో నుంచి బయటకు వచ్చేయడం వెనుక కారణాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.మంగళవారం జొమాటోలో ఆయన ఆఖరి వర్కింగ్ డేగా తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా ఆయన ఉద్యోగుల్ని ఉద్దేశించి మెయిల్ పెట్టినట్లు సమాచారం. ఆరేళ్ల జొమాటోతో తన ప్రయాణం ముగిసిందని, ఇంక కొత్త జర్నీ ఆరంభించబోతున్నట్లు ఆయన పేరు మీద ఒక ప్రకటన వైరల్ అవుతోంది. నిత్యావసర సరుకుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారం రెండూ గౌరవ్ ఐడియాలే.
పైగా ఓవర్సీస్‌లో జొమాటో విస్తరణ కూడా ఆయన అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు.ఈ నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి.ఇదిలా ఉంటే గుప్తా.. 2015లో జొమాటోలో చేరగా.. 2018 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా వ్యవహరిస్తుండగా.. 2019లో ఆయనకు జొమాటో ఫౌండర్ హోదా దక్కింది. జొమాటో నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో సొంతంగా మరేదైనా స్టార్టప్ ప్రారంభిస్తారా? అనే చర్చ అప్పుడే మొదలైంది.