ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవల్లో ఉన్న జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ భాగస్వాములుగా పెద్ద ఎత్తున మహిళలను చేర్చుకోనుంది. ప్రస్తుతం డెలివరీ పార్ట్‌నర్స్‌లో మహిళల వాటా 0.5 శాతం. తొలి అడుగులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 10 శాతానికి చేర్చనున్నట్టు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, హైదరాబాద్, పుణేలో వీరి నియామకాలు ఉంటాయని తెలిపారు. అయితే డెలివరీ భాగస్వాములుగా మహిళలను చేర్చుకోవడం లక్ష్యం నిర్ధేశించుకున్నంత సులువు కాదని అభిప్రాయపడ్డారు.
‘మహిళలను ఈ రంగం ఆకర్శించడానికి, అలాగే వారు కొనసాగడానికి విధానాలు మారాలి. ఆత్మ రక్షణ కోసం తప్పనిసరిగా వారికి శిక్షణ ఇస్తున్నాం. మహిళల కోసం 24 గంటలూ హెల్ప్‌లైన్ పనిచేస్తుంది. యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ ఉంటుంది. ఆపత్కాలంలో లైవ్ లొకేషన్ క్షేత్ర స్థాయి సిబ్బందికి, కేంద్ర కార్యాలయానికి, సమీపంలో ఉన్న డెలివరీ భాగస్వాములకు వెంటనే చేరుతుంది’ అని వెల్లడించారు. వీరికి కనీస వసతులు కల్పించేందుకు రెస్టారెంట్స్ సైతం ముందుకు వచ్చాయని తెలిపారు. ప్రజలు సమీప భవిష్యత్తులో డెలివరీ బాయ్స్‌గా కాకుండా డెలివరీ భాగస్వాములుగా పరిగణిస్తారని తాను భావిస్తున్నట్టు చెప్పారు. పనిచేయడానికి అనువైన ప్రదేశంగా జొమాటోను తీర్చిదిద్దేందుకు భాగస్వాముల సూచనలను అమలు చేస్తున్నామన్నారు.