ఈ ఏడాది జరిగే యూఎస్ ఓపెన్‌లో ఆడాలా… వద్దా… అనే సందిగ్ధంలోనే ఉన్నానని జర్మనీ టెన్నిస్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ తెలిపాడు. ప్రస్తుతం అమెరికాలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉండటమే అందుకు కారణమని 23 ఏళ్ల జ్వెరెవ్ వ్యాఖ్యానించాడు. ఒక టెన్నిస్ వెబ్సైట్ ఇంటర్వూ్యలో అతను మాట్లాడుతూ ‘ప్రస్తుతం అమెరికా పరిస్థితి బాగా లేదు.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో యూఏస్ ఓపెన్‌లో ఆడే విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నా టీమ్‌తో చర్చించి త్వరలోనే ఈ విషయంపై స్పష్టతనిస్తా’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన మహిళల ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ, పురుషుల సింగిల్స్ ఆటగాడు నిక్ కిరియోస్ టోర్నీలో ఆడటం లేదని ప్రకటించారు. యూఎస్ ఓపెన్ ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరుగనుంది.