ఏపీలో కొత్త స్నేహితుల అవ‌స‌రం లేదు

Amit Shah comments on TDP and BJP alliance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టీడీపీ, బీజేపీ మైత్రీ బంధానికి తెర‌ప‌డ‌బోతోందంటూ కొన్ని రోజులుగా వ‌స్తున్న ఊహాగానాల‌కు తెర‌దించారు జాతీయ అధ్య‌క్షుడు  అమిత్ షా. టీడీపీతో త‌మ‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, తమ మైత్రి కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టంచేశారు. కొత్త స్నేహితుల ప్ర‌స్తావ‌న అవ‌స‌రం లేద‌ని అమిత్ షా తేల్చిచెప్పారు. టీడీపీతో చెలిమిని తెగ‌తెంపులు చేసుకుని బీజేపీ వైసీపీతో కొత్త స్నేహానికి నాంది ప‌ల‌క‌బోతోందంటూ కొన్నిరోజులుగా ఇటు ప్రాంతీయ మీడియాలోనూ అటు జాతీయ మీడియాలోనూ వార్త‌లొస్తున్నాయి. బీజేపీ వైసీపీ చెలిమిని వ్య‌తిరేకిస్తున్నందుకే వెంక‌య్య‌నాయుణ్ని కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి తప్పించి ఉప‌రాష్ట్ర‌ప‌తిని చేశార‌న్న వాద‌నా వినిపిస్తోంది.

గ‌తంలో జ‌గ‌న్ కు అపాయింట్ మెంట్ ఇవ్వటానికి నిరాక‌రించిన మోడీ… త‌ర్వాత ఆయ‌న‌తో భేటీ కావ‌టం, రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో వైసీపీ బీజేపీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌టం. వంటి వ‌న్నీ బీజేపీ వైసీపీ క‌లిసి న‌డుస్తాయ‌న్న‌దానికి సంకేతాలు అనీ రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రిగింది. బీజేపీ మౌత్ వాయిస్ గా భావించే రిప‌బ్లిక్ టీవీ అయితే ఓ అడుగు ముందుకేసి వైసీపీ ఎన్డీఏలో చేరుతుందంటూ ఓ క‌థ‌నాన్ని కూడా ప్ర‌సారం చేసింది.

2019 ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎక్కువ సీట్లు, ఓట్లు గెల‌వ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని, త‌మ‌ది రాజ‌కీయ పార్టీ అని… రాజ‌కీయ లాభ‌న‌ష్టాలు బేరీజు వేసుకుని ముందుకు వెళ్తామ‌ని… టీడీపీ తో పొత్తు శాశ్వ‌తం కాద‌ని బీజేపీ సీనియర్ మంత్రి ఒక‌రు అన్న‌ట్టు కూడా ఆ చాన‌ల్ పేర్కొంది. ఈ నేప‌థ్యంలో రేపో మాపో బీజేపీ వైసీపీ కొత్త చెలిమిపై  అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని అంతా భావిస్తున్న స‌మ‌యంలో అమిత్ షా … ఈ ఊహాగానాల‌న్నింటికీ తెర‌దించారు.

బీజేపీ వైసీపీ పొత్తు పెట్టుకుంటాయ‌న్న వార్త‌ల‌ను ఖండిస్తున్నాన‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం త‌మ‌కు అధికార టీడీపీతో స‌త్సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌ని,   కొత్త స్నేహితుల అవ‌స‌రం లేద‌ని తేల్చిచెప్పారు. వైసీపీ బీజేపీతో ట‌చ్ లో ఉందంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించిన అమిత్ షా కొన్ని పార్టీలే కాదు… దేశం మొత్తం బీజేపీతో ట‌చ్ లోనే ఉంద‌ని చెప్పారు. తెలంగాణ‌లో మాత్రం తాము ఎవ‌రితో పొత్తు పెట్టుకోబోమ‌ని ఒంట‌రిగానే  పోరాటం చేస్తామ‌ని తెలిపారు. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌యిన త‌రువాత వెంక‌య్య‌నాయుడు తొలిసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలోనే అమిత్ షా టీడీపీ, బీజేపీ చెలిమిపై వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

మరిన్ని వార్తలు:

జగన్ అంతర్మధనం ?

అల్ల‌ర్ల‌కు మీరే కార‌ణం… హ‌ర్యానా ప్ర‌భుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం

బాబుకి పరిటాల వారి పెళ్లి పిలుపు…