డేరా బాబా సాధార‌ణ ఖైదీకాదు

gurmeet ram rahim spent luxury time rohtak jail

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇద్ద‌రు సాధ్విల‌పై అత్యాచారం కేసులో డేరాబాబా దోషిగా నిర్దార‌ణ అయిన త‌రువాత చాలారోజులు ఆయ‌నకు సంబంధించిన వార్త‌లే ప‌త్రిక‌ల్లో ప‌తాక‌శీర్షిక‌ల్లో నిలిచాయి. న్యూస్ చాన‌ళ్లు, సోష‌ల్ మీడియా నిండా కూడా బాబా వార్త‌లే. ఇప్ప‌టిదాకా వెలుగుచూడ‌ని బాబా అక్ర‌మాలు, ఆశ్ర‌మంలో డేరా వెన‌క జ‌రిగే సంగ‌తులు..వంటి వాటి గురంచి ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాలు వ‌చ్చాయి. డేరాబాబా ద‌త్త‌పుత్రికగా చెప్పుకునే హ‌నీప్రీత్ అరెస్టు దాకా కూడా ఈ వార్త‌ల ప‌రంప‌ర సాగింది. ప‌దిహేనేళ్ల క్రితం డేరా బాబా అక్ర‌మాల గురించి ప్ర‌ధాని వాజ్ పేయికి ఓ సాధ్వి రాసిన లేఖ‌ను తొలిసారి ప్ర‌చురించిన స్థానిక ప‌త్రిక ఎడిట‌ర్ త‌ర్వాతిరోజుల్లో అనుమానాస్ప‌ద స్థితిలో మర‌ణించారు. ఈ కేసులో గుర్మీత్ బాబా ప్ర‌ధాన నిందితుడు. అలాగే సిర్సా ఆశ్ర‌మం మాజీ మేనేజ‌ర్ రంజిత్ సింగ్ హ‌త్య‌కేసులోనూ డేరా బాబా పై విచార‌ణ జ‌రుగుతోంది. ఇద్ద‌రు సాధ్విల‌పై అత్యాచారం కేసులో బాబాను దోషిగా నిర్దారించిన సీబీఐ కోర్టులోనే ఈ కేసు విచార‌ణ కూడా తుదిద‌శ‌కు చేరుకుంది.

dera-baba

ఈ హ‌త్య‌కేసులో ప్ర‌ధాన‌సాక్షిగా ఉన్న బాబా మాజీ డ్రైవ‌ర్ ఖ‌ట్టాసింగ్…త‌న వాంగ్మూలం మ‌ళ్లీ తీసుకోవాల‌ని సిబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖలు చేయ‌డంతో తుదిద‌శ విచార‌ణ వాయిదాప‌డింది. ఈ రెండు కేసుల్లో బాబా హ‌స్త‌ముంద‌ని నిర్దార‌ణ అయితే ఆయన‌కు ఉరిశిక్ష ప‌డే అవ‌కాశ‌ముంద‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు. ఈ ఉరిశిక్ష సంగ‌తి ప‌క్క‌న‌పెడితే రోహ్ త‌క్ జైలులో 20 ఏళ్ల కారాగార‌వాసం అనుభ‌విస్తున్న గుర్మీత్ బాబా…సాధార‌ణ ఖైదీలాగే శిక్ష అనుభ‌విస్తున్నాడ‌ని జైలు అధికారులు చెబుతున్న‌ప్ప‌టికీ వాస్త‌వం అందుకు విరుద్దంగా ఉంది. రోహ్ త‌క్ జైల్లోనే శిక్ష అనుభ‌విస్తూ బెయిల్ పై బ‌య‌టికి వ‌చ్చిన రాహుల్ అనే ఖైదీ గుర్మీత్ జైలు జీవితంపై దిగ్బ్రాంతి క‌లిగించే విష‌యాలు వెల్ల‌డించాడు. అసలు గుర్మీత్ ను తాను ఎప్పుడూ జైల్లో చూడ‌లేద‌ని, తానే కాక‌. త‌న తోటి ఖైదీలు ఎవ‌రూ కూడా గుర్మీత్ ను చూడ‌నేలేద‌ని రాహుల్ చెప్పాడు. డేరా బాబాను రోహ్ తక్ జైలుకు తీసుకొచ్చాక జైల్లో క‌ఠిన నిబంధ‌న‌లు విధించారని అత‌ను తెలిపాడు. గుర్మీత్ కు ప్ర‌త్యేక సౌక‌ర్యాలు కల్పిస్తున్నార‌ని చెప్పాడు. జైల్లోని ఇత‌ర ఖైదీలు రోజూ ప‌నులు చేస్తోంటే గుర్మీత్ మాత్రం ఎలాంటి ప‌నులూ చేయ‌డం లేద‌ని వెల్ల‌డించాడు. ఖైదీలను క‌లుసుకునేందుకు కుటుంబ‌స‌భ్యులో స‌న్నిహితులో వ‌స్తే..కేవ‌లం 20 నిమిషాలే వారిని మాట్లాడ‌నిస్తార‌ని, గుర్మీత్ ను క‌ల‌వ‌డానికి ఎవ‌రైనా వ‌స్తే క‌నీసం రెండుగంట‌ల పాటు మాట్లాడ‌నిస్తారని తెలిపాడు. మొత్తానికి రాహుల్ చెప్పిన విష‌యాలు చూస్తే…ఆశ్ర‌మంలానే జైల్లోనూ గుర్మీత్ రాజ్ భోగాలు అనుభ‌విస్తున్నాడు.