మాజీ ప్రధాని, భారత రత్న అవార్డు గ్రహీత, రాజకీయ భీష్ముడు అటల్ బిహారి వాజ్‌పేయి ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం సాయంత్రం 05:05 గంటలకు తుదిశ్వాస విడిచారు. వాజ్ పేయి వయసు 93 సంవత్సరాలు. ఈమేరకు ఆస్పత్రివర్గాలు తాజాగా ఆఖరి హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. జూన్ 11న ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయి ఆరోగ్యం గత 9 వారాలుగా స్థిమితంగానే ఉంటూ వచ్చినప్పటికీ గడిచిన 36 గంటల్లో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు ఎయిమ్స్ వర్గాలు ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నాయి. ఆయన మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆసుపత్రిలో దాదాపు తొమ్మిది వారాల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. వాజ్ పేయి మరణవార్తతో యావత్ దేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. వాజ్ పేయి మరణంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నారు.