అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే వారం ఇండియాకు రానున్నారు. దిల్లీలో జరగనున్న జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రెండు దేశాల సంబంధాలపై సెప్టెంబర్ 8న ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పేదరిక నిర్మూలన, ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థల బలోపేతం లాంటి అనేక ప్రపంచ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపింది.
సెప్టెంబర్ 7న దిల్లీకి చేరుకోనున్న బైడెన్.. 8వ తేదీన మోదీతో భేటీ కానున్నారని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అనంతరం 9, 10 తేదీల్లో జరిగే జీ20 సమావేశాల్లో పాల్గొననున్నారు. అనంతరం 10 తేదీన వియత్నాంకు బయలదేరనున్నారని తెలిపింది. మరోవైపు జీ20కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న తీరును అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారని శ్వేతసౌధం తన ప్రకటనలో చెప్పింది.