అర్ధ‌రాత్రి పూజ‌ల‌తో అమ్మ‌వారికి అప‌చారం

Midnight Tantric Puja is not good

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అర్ధ‌రాత్రి పూజ‌లు చేస్తే అనుకున్న కోరిక‌లు నెర‌వేరుతాయా…?. వేళ‌కాని వేళ‌ల్లో జ‌రిపే పూజ‌ల‌తో అమ్మ‌వారి తాంత్రిక శ‌క్తులు నిద్ర‌లేస్తాయా…? విజ‌య‌వాడ దుర్గ‌గుడిలోనే కాకుండా..రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆల‌యాల్లోనూ ఇలాంటి పూజ‌లు జ‌రుగుతున్నాయా..? దుర్గ‌గుడి వివాదం త‌ర్వాత అంద‌రికీ వ‌స్తున్న సందేహాలివి. అమ్మవారి స‌న్నిధిలో అర్ధ‌రాత్రి పూజ‌ల‌పై నిజ‌నిర్ధార‌ణ క‌మిటీతో పాటు పోలీసులు స‌మాంత‌రంగా నిర్వ‌హించిన విచార‌ణ‌లో దిగ్భ్రాంతిక‌ర విష‌యాలు వెలుగుచూశాయి. డీసీపీ కాంతి రాణా టాటా నేతృత్వంలోని బృందం 20 మందిని విచారించ‌గా వారిలో ముగ్గురు ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిపిన‌ట్టు అంగీక‌రించ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కొత్త సంవ‌త్స‌రం ప్రారంభానికి నాలుగు రోజుల ముందు డిసెంబ‌రు 26న‌ అర్ధ‌రాత్రి అమ్మ‌వారి కవ‌చాన్ని తొల‌గించి మ‌హిషాసుర మ‌ర్దినిగా అలంక‌రించి పూజ‌లు చేశామ‌ని, ఆపై సాధార‌ణ అలంకారం చేశామ‌ని విశ్వ‌నాథ‌ప‌ల్లి శివాల‌యానికి చెందిన పూజారి పార్ధ‌సార‌ధి పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించాడు.

ఆ సంద‌ర్భంగా అమ్మ‌వారి క‌వ‌చం తొల‌గించామ‌ని, దీంతో అలంక‌ర‌ణ కుద‌ర‌క‌పోవ‌డంతో మ‌రుస‌టి రోజు ఉద‌యం 9గంట‌ల త‌ర్వాత ద‌ర్శ‌నం నిలిపివేసి, స‌రిచేశామ‌ని సుజ‌న్ అనే పూజారి తెలిపాడు. అయితే ప్ర‌ధాన అర్చ‌కుడు బద్రీనాథ్ బాబు మాత్రం తాము శుద్ధి చేసి అలంక‌ర‌ణ చేశాము త‌ప్ప పూజ‌లు చేయ‌లేద‌ని, ఈవో ద‌గ్గ‌ర అనుమ‌తి తీసుకునే శుద్ధిచేశామ‌ని తెలిపారు. శుద్ధికి  స‌హాయంగా ఉండే పరిచార‌కుల‌ను విచారించ‌గా సాధార‌ణంగా తామే శుద్ధి చేస్తామ‌ని, ఆ రోజున త‌మ‌ను బ‌య‌టఉండ‌మ‌న్నార‌ని వాంగ్మూలం ఇచ్చారు.
సీసీటీవీ ఫుటేజ్ లో క్యూ లైన్ ఇన్ స్పెక్ట‌ర్ మ‌ధు ఉన్న‌ట్ట క‌నిపించ‌డంతో ఆయ‌న్ను విచారించ‌గా…ఆ స‌మ‌యంలో త‌న‌ను బ‌య‌ట‌కు పంపార‌ని చెప్పారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఇదే మాట చెప్పారు. ప్ర‌ధానార్చ‌కుడు త‌మ‌ను బ‌య‌టేఉంచార‌ని, లోప‌ల ఏం జ‌రిగిందో తెలియ‌ద‌న్నారు. ప్ర‌ధానార్చ‌కుడు, ఇత‌రులు రాత్రి 12.30 గంట‌ల త‌ర్వాత వెళ్లిన‌ట్టు రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తెలిపారు. నివేదిక వివ‌రాలు తెలుసుకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విస్తుపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇంత జ‌ర‌గుతోంటే దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. దుర్గగుడి ఈవో సూర్య‌కుమారి ప్ర‌మేయంతోనే ఈ వ్య‌వ‌హారం జ‌రిగింద‌ని పోలీసులు నివేదికలో పేర్కొన‌డంతో వెంట‌నే ఆమెను అక్క‌డి నుంచి త‌ప్పించాల‌ని నిర్ణ‌యించారు. అస‌లు ఆల‌యం లోప‌లికి బ‌య‌టి వ్య‌క్తులు ఎలా రాగ‌లిగార‌ని, ఇది పూర్తిస్థాయి పాల‌నా వైఫ‌ల్య‌మేన‌ని చంద్ర‌బాబు అన్న‌ట్టు స‌మాచారం. ఇక్క‌డే ఇలా జ‌రుగుతోందా…? రాష్ట్రంలోని ఇత‌ర ఆల‌యాల్లోనూ ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా…అన్న‌ది విచారించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. అటు దేవాదాయ శాఖ స‌మ‌ర్పించిన నివేదిక‌లోనూ వేళ‌కాని వేళ‌లో కొన్ని పూజ‌లు జ‌రిగిన‌ట్టుగా నిర్ధారించిన‌ట్టు తెలుస్తోంది.