ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీకి రానున్నారు. ఆయన ఏపీకి వచ్చేందుకు.. డీజీపీ అనుమతివ్వడంతో ఈరోజు ఉదయం పదిగంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకోనున్నారు చంద్రబాబు. అయితే ఎల్జీపాలిమర్స బాధితులను పరామర్శించేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ.. విమాన సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో విశాఖ పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది.
అయితే ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈరోజు నుండి కాకుండా రేపటి నుంచి విమానాలను నడిపేందుకు కేంద్ర పౌరవిమానయానశాఖ అనుమతిచ్చింది. విమానాల ద్వారా వచ్చే వారిని క్వారెంటైన్ కు తరలించే విషయంగా ఇంకా మార్గదర్శకాలు రెడీ కాకపోవడంతోనే ఈరోజు విమానాలకు అనుమతి వద్దని ప్రభుత్వం కోరినట్టు సమాచారం అందుతుంది.
అంతేకాకుండా చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో ఈ ఒక్క రోజు ఎయిర్ పోర్టులను మూసేయడం మీద టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం చంద్రబాబును అడ్డుకునే కుట్రే అంటూ ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. చంద్రబాబుకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడం వైసీపీ ప్రభుత్వం కుట్రలో భాగంగా ఉందని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా ఇక చేసేది లేక రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకోనున్నారు. మరి ఈరోజు అలాగే.. విశాఖపట్టణం వెళ్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి అలా వెళ్లేందుకు తిరిగి అక్కడ పోలీసులు చంద్రబాబుకు అనుమతులు ఇస్తారా లేదా అని విషయంపై కూడా సందిగ్ధత నెలకొంది.