ఏపీ ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ, కృష్ణ, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించింది.
కాగా, భారీ వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు స్కూళ్లకు రాలేని పరిస్థితి ఉంటే ఆ జిల్లా అధికారులకు తెలంగాణ విద్యాశాఖ సెలవులు ప్రకటించవచ్చని ఆదేశించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర మొత్తం సెలవులు ఇవ్వలేమని తెలిపింది. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో కురవవని వివరించింది. వర్షాలతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చినప్పుడు సిలబస్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.