కరోనాతో క్రీడల్లో న్యూ రూల్స్.. ఎవరిది వారే వాడుకోవాలి..

ప్రపంచాన్నే వణికించేస్తుంది కరోనా వైరస్. దీంతో అది చూపే ప్రభావాన్ని బట్టి కొత్త కొత్త నిబంధలను వెలుగు చూస్తున్నాయి. కరోనాతో పయనం అంటే కరోనా వైరస్ తో కలిసి జీవనమే కాకుండా దాంతో కలిసి జీవిస్తూనే అది అంటుకోకుండా పలు రకాలుగా జాగ్రత్తలు తీసుకొనేందుకు ప్రజలు సిద్ధపడే సమయం ఆసన్నమైంది. అయితే కరోనాతో ఇప్పటికే క్రికెట్‌లో బంతి మెరుపు కోసం వాడే ఉమ్మిని నిషేదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఇతర క్రీడల్లో కూడా పెను మార్పులు సంభవించనున్నాయి. క్రీడా ప్రపంచం కూడా ‘కరోనాకు ముందు…. కరోనా తర్వాత’ దశలోకి మారుతోంది. హాకీ మ్యాచ్‌ల్లో గోల్‌ కాగానే సహచరులంతా భుజాలపై చేతులేసి చేసుకునే సంబరాలు కూడా ఇకపై కనిపించే సూచనలు లేకుండా పోతున్నాయి.

అదేవిధంగా బంతిని పొరపాటున కూడా ముట్టుకోకూడదని ఆదేశాలను జారీ చేసింది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్‌) ఆటగాళ్ల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని 12 మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అన్ని దేశాలు కూడా ఇకనుంచి ఎఫ్‌ఐహెచ్‌ నిబంధనలతో పాటు ప్రభుత్వ ఆదేశాలను విధిగా పాటించాలని, కరోనా లక్షణాలున్న వారు శిక్షణకు, ఆటకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.

అదేవిధంగా ‘శిక్షణ కోసం ఎవరికి వారు వ్యక్తిగత వాహనాల్లోనే రావాలి. గుంపులుగా బస్‌లో రాకూడదు. స్క్రీనింగ్‌ వంటి టెస్ట్ ల కోసం నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలి. ఒకటిన్నర మీటర్‌ భౌతిక దూరం తప్పకుండా పాటించాలి. అలాగే.. చేతులతో బంతిని ముట్టుకోకూడదు. సహచరులతో కలిసి సంబరాలు చేసుకోకూడదు. ఎవరి నీళ్ల సీసాలు, ఎనర్జీ డ్రింక్‌ బాటిల్స్ వారే ఉపయోగించుకోవాలి. ఎవరి క్రీడా సామగ్రి వారే వాడుకోవాలి. ఇతరులు వాడినవి ఎట్టిపరిస్థితుల్లో కూడా ఇంకొకరు వాడకూడదు. శిబిరాలు ముగిసిన తర్వతా నేరుగా ఇంటికే వెళ్లాలి’ అని ఎఫ్‌ఐహెచ్‌ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎఫ్‌ఐహెచ్‌ దశలవారీ ట్రెయినింగ్‌ను సూచించింది. ఒకటో దశలో వ్యక్తిగత శిక్షణ, రెండో దశలో చిన్న చిన్న గ్రూపుల శిక్షణ, మూడో దశలో పోటీ శిక్షణ, ఆఖరి దశలో టీమ్‌ మొత్తానికి శిక్షణ ఏర్పాటు చేయాలని వెల్లడించింది.