టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాను ఐపీఎల్ 2013 వేలంలో కొనుగోలు చేయమని విరాట్ కోహ్లీకి తాను చెప్పానని.. కానీ కోహ్లీ అప్పట్లో తన మాట అంతగా పట్టించుకోలేదని తెలిపాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్. అతను అత్యుత్తమ బౌలర్ అవుతాడని తాను ముందే పసిగట్టానని… కానీ కోహ్లీ తన సూచనను అంత సీరియస్‌గా పట్టించుకోలేదని.. అన్నారు. ఆ ఛాన్స్ ముంబై ఇండియన్స్ దక్కించుకుందని తెలిపాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పార్దివ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఇంకా పార్థివ్ మాట్లాడుతూ… ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి బ్యాట్స్మెన్లపైనే ఎక్కువగా ఆధారపడిన ఆర్సీబీ.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని అన్నారు. అలాగే.. 2016లో ఫైనల్‌కు చేరి సన్‌రైజర్స్ చేతిలో ఓడిందని వివరించారు. ఇక తమ బలహీనతలను తెలసుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో మాత్రం తన పంథా మార్చుకుందని.. వేలంలో ఫాస్ట్ బౌలర్లు క్రిస్ మోరీస్ (రూ. 10 కోట్లు), కేన్ రిచర్డ్సన్ (రూ. 4 కోట్లు), డేల్ స్టెయిన్ (రూ. 2 కోట్లు)లను కొనుగోలు చేసిందని వివరించారు.
కాగా కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ వరుసగా వాయిదా పడుతూ వస్తుంది. టీమిండియా యువ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ టీ20 ప్రపంచకప్‌కు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అని.. అతను పరిమిత ఓవర్లకు సరిగ్గా సరిపోతాడని పార్దివ్ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కేఎల్ రాహుల్ కీపర్‌గా సెట్ అవుతాడని.. టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే రాహుల్‌ను షార్ట్ టైమ్ ప్లాన్‌లా చెప్పుకోవచ్చని పార్థివి పటేల్ వివరించాడు.