గుడ్ న్యూస్: ఆగష్టు 31వరుకు టర్మ్‌ లోన్లపై మారటోరియం పొడిగింపు

కరోనా కాలంలో ఆర్బీఐ ప్రజలకు కాస్త ఊరటనిస్తోంది. పలు దఫాలుగా ఇప్పటికే ఈఎమ్ఐలపై మారిటోరియం విధస్తూ వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఇండియా. తాజాగా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఈరోజు ముంబైలో మీడియాతో మాట్లాడారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తిన్న‌ద‌ని అన్నారు. దీంతో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు త‌గ్గించామ‌ని.. రెపో రేటు 4.4 శాతం నుంచి 4శాతానికి చేరుకున్న‌ట్లు తెలిపారు. దీని వ‌ల్ల ఈఎంఐలో తీసుకున్న రుణాల‌పై భారం త‌గ్గ‌నుంది. కోవిడ్‌-19 సంక్షోభం సమయంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబంధించి ఊహాచిత్రాన్ని ఇస్తున్న‌ట్లు ఆయ‌న వెల్లడించారు.

అదేవిధంగా రివ‌ర్స్ రెపో రేటును 3.35 శాతానికి త‌గ్గించిన‌ట్లు తెలిపారు. భార‌త్ ఆర్థికంగా మ‌ళ్లీ గాడిలో ప‌డుతుంద‌న్న విశ్వాసం క‌లిగి ఉండాల‌ని శ‌క్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఏడాది వాణి‌జ్యం సుమారు 13 నుంచి 32 శాతానికి ప‌డిపోయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ వివరించారు. అంతేకాకుండా ప్రైవేటు సంస్థ‌ల వినియోగం దారుణంగా ప‌డిపోయిన‌ట్లు తెలిపిన ఆయన కీల‌క‌మైన ప‌రిశ్ర‌మ‌ల ఉత్ప‌త్తి కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని అన్నారు.

ఇంకా క‌రోనా సంక్షోభం స‌మ‌యంలో ఒక్క వ్య‌వ‌సాయంపైనే ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు శ‌క్తికాంత్ తెలిపారు. రుతుప‌వ‌నాల‌పై కేంద్ర వాతావ‌ర‌ణ‌శాఖ ఇస్తున్న స‌మాచారం వ్య‌వ‌సాయం రంగంపై మ‌రింత ఆశ‌ల‌ను రేపుతున్నాయని చెప్పారు. ఇక ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం ఏప్రిల్‌లో 8.6 శాతానికి చేరిన‌ట్లు తెలిపారు. కూర‌గాయ‌లు, నూనెదినుసులు, పాల ధ‌ర‌లు తారాస్థాయికి చేరినట్లు వివరించారు. కాగా జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది నెగ‌టివ్‌లోనే ఉంటుందని శక్తికాంత్ స్పష్టం చేశారు. టర్మ్‌ లోన్లపై మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు ఇస్తున్నట్లు తెలిపారు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు టర్మ్‌ లోన్లపై మారటోరియం పొడిగిస్తున్నట్లు వివరించారు.

అలాగే.. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గిందని తెలిపారు. భారత విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిందని తెల్పిన ఆయన మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడిందని వివరించారు. కాగా తక్కువ ధరలో రుణాలు, వడ్డీరేట్లు తగ్గడంతో సామాన్యుడికి లాభం చేకూరుతుందని శక్తికాంత్ వెల్లడించారు.