టిడిపి అధినేత నారా చంద్రబాబు అరెస్టును రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని విమర్శించారు. చంద్రబాబు అవినీతి అనకొండ అని.. రూ. 241 కోట్లు కొల్లగొట్టి పక్కా ఆధారాలతో దొరికారని తెలిపారు. ఆయన బోగస్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి రోజా విమర్శించారు.
అంతేకాదు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అని అన్నారు. చంద్రబాబు అరెస్టుతో న్యాయవ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. కడిగిన ముత్యం చంద్రబాబు కాదని.. అవినీతిలో కూరుకుపోయిన ముత్యమని హేళన చేశారు. టిడిపి నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇక త్వరలోనే నారా లోకేష్, అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ అవుతారని అన్నారు.
చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, స్టేలు తెచ్చుకుంటూ, తప్పించుకుంటూ వచ్చిన .. జగన్ హయాంలో అది సాధ్యం కాలేదు అన్నారు. జగన్ ఏ తప్పు చేయలేదన్న, ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నారని రోజా అన్నారు. చంద్రబాబు కూడా ఈ కేసులో ఈడి విచారణ,సిబిఐకు సిద్ధమని ప్రకటించాలని డిమాండ్ చేశారు.