ప్రజల్లో కలిసిపోవడంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రూటే సపరేటు. ఆయన పదేళ్ల పిల్లాడితో ఇట్టే కలిసిపోయి పిల్లాడిలా సందడి చేయగలరు. అరవై ఏళ్ల పండు ముసలమ్మతో కూర్చొని ముచ్చట్లూ పెట్టగలరు. తాజాగా ఆయన తను చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా తమిళనాడులో పర్యటించారు. ఊటీలో మహిళలు నడుపుతున్న ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ వారి అనుభవాలు తెలుసుకున్నారు.
ఈ క్రమంలో ఓ చిన్నారి రాహుల్ చెంతకు వచ్చి ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడిగింది. రాహుల్ మొదట ఆ బుక్‌లో సంతకం చేసి.. నాకు ఓ ఫేవర్ చేస్తావా అంటూ ఆ చిన్నారిని ఆటోగ్రాఫ్ అడిగారు. ఆ బుజ్జిపాపాయి దానికి నవ్వుతూ తన పేరును ఓ పేపర్ మీద రాసి ఇచ్చింది. ఆ పేపర్‌ను రాహుల్ చింపి తన పాకెట్లో పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.