రిషభ్ పంత్.. భారత క్రికెట్ జట్టులోకి వచ్చిన కొత్తలో అతనొక ఆశా కిరణం.. ఎంఎస్ ధోనికి వారసుడు.. భారత క్రికెట్ జట్టు ఎంతో కాలంగా అన్వేషిస్తున్న నాల్గోస్థానంలో అతనే సరైనోడు…. క్రికెట్ పెద్దలు ఎవరు నోట చూసినా ఇవే మాటలు వినిపించేవే. ఆరంభంలో రిషభ్ పంత్ ఆట మెరుగ్గా ఉండటంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. అదే సమయంలో అతనిపై ఒత్తిడి కూడా పెరిగిపోయింది. క్రమేపి పంత్ ఆట దిగజారుతూ వస్తోంది. ఇటీవల కాలంలో ఎనిమిది సందర్భాల్లో 10 బంతుల్లోపే రిషభ్ పంత్ ఔట్ కావడం మింగుడు పడని అంశం. ఇదే ఇప్పుడు సెలక్టర్లకు సవాల్‌గా మారిపోయింది. వచ్చిన ఏ అవకాశాన్ని పంత్ వినియోగించుకోవడం లేదు.
మరొకవైపు యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్.. పంత్‌కు పోటీగా మారిపోయాడు. బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు శాంసన్‌ను ఎంపిక చేసినా అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. పంత్‌నే నమ్ముకునే బరిలోకి దిగిన టీమిండియా యాజమాన్యం అంచనాలు మరొకసారి తప్పాయి. యువ ఆటగాళ్లు రాణిస్తుంటే పంత్ మాత్రం ఏదో వచ్చాం.. వెళ్లాం అన్న రీతిలోనే ఆటను కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆఖరి టీ20లో పంత్ పేలవంగా వెనుదిరిగాడు. 9 బంతులాడి 6 పరుగులు మాత్రమే బౌల్డ్ అయ్యాడు. స్కోరు పెంచే క్రమంలో పంత్ ఆడిన షాట్‌తో అటు అభిమానులకు చిరాకు తెప్పించింది. ఏయ్.. పంత్ ఇక నువ్వు మారవా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
‘ప్రతీ మ్యాచ్‌లోనూ పంత్ బోడి గుండు కొట్టించుకుంటున్నాడు’ అని ఒక అభిమాని విమర్శించగా, ‘ పంత్ నుంచి మరొక అద్భుత ఇన్నింగ్స్’ అంటూ మరొకరు ఎద్దేవా చేశారు. ‘ విమర్శకులకు నోరు మూయించడానికి ఇక మేకులు కొట్టుకుంటూ కూర్చో’ అని మరొక అభిమాని మండిపడ్డాడు. ‘ అసలు రిటైర్మెంట్ ప్రకటిద్దామనే ఆలోచనలో ఉన్న ధోని ఇక నువ్వు వీడ్కోలు తీసుకోవద్దు.. పంత్‌నే సాగనంపుదాం’ అని మరొక అభిమాని సెటైర్ వేశాడు. ఇలా అభిమానులు విమర్శలు చేయడమే కాకుండా మీమ్స్‌తో పంత్‌ను ఆడేసుకుంటున్నారు.