కలలో జరిగే లాంటి ఘటనలు నిజ జీవితంలో చోటు చేసుకుంటే ఒక్క క్షణం ప్రపంచమంతా ఆగినంత పని అవుతుంది. అలాంటి అనుభూతికే లోనయ్యారు దంపతులు. వివరాల్లోకి వస్తే అమెరికాలోని వర్జీనియాలో ఓ కుటుంబానికి అదృష్టం వరించింది. కరోనా లాక్డౌన్తో ఇంట్లో ఉండలేక విసిగిపోయిన అలా షికారు కోసం బయటకు వచ్చారు. లాక్ డౌన్ తో విసిగెత్తిపోయిన డేవిడ్, ఎమిలీ షాంజ్ దంపతులు తమ పిల్లలతో కలిసి కారులో సరదాగా రోడ్డు మీదకు వచ్చారు. అలా తాజా గాలి పీల్చుకుంటూ.. ప్రకృతి సోయగాల్ని ఆస్వాదించుకుంటూ ముందుకు సాగారు.
అయితే ఉన్నట్టుండి రోడ్డు మీద వారికి ఓ బ్యాగ్ వంటిది దర్శనమిచ్చింది. ముందు అది చెత్త కవరు అనుకున్నారు. దగ్గరికి వెళ్లి చూస్తే.. కొత్త బ్యాగ్. పక్కనే ఇంకో బ్యాగు కూడా కనిపించింది. అటూ ఇటూ వెదికితే ఎవరూ కనిపించలేదు. కారు వెనుక రెండు బ్యాగులు వేసుకుని ఇంటిదారి పట్టారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆ బ్యాగులను విప్పి చూసిన కళ్లు షాక్ తిన్నాయి. రెండు బ్యాగుల నిండా క్యాష్. కరకరలాడే కొత్త డాలర్లు. లెక్కచూస్తే మిలియన్ అంటే పదిలక్షల డాలర్లుగా తేలింది. మన కరెన్సీలో అయితే ఏడున్నర కోట్లు. క్యాష్ వాల్ట్ అని రాసిన ఓ కాగితం కూడా బ్యాగులో దొరికింది. షాంజ్ దంపతులు వెంటనే కరోలిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి ఫోన్ చేసి విషయం చెప్పారు.
ఇద్దరు పోలీసులు వచ్చి సంచులను పరిశీలించి డబ్బు లెక్కపెట్టుకున్నారు. మిలియన్ డాలర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ సందర్భంగా షెరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ సొమ్ము అసలు యజమానులు ఎవరో తెలిసిందని అన్నారు. అయితే పేరు బయటపెట్టలేదు కానీ.. వారు తమ సొమ్ము తమకు దొరికినందుకు షాంజ్ కుటుంబానికి మంచి బహిమతి ఇస్తారని ఆశిస్తున్నట్టు స్పష్టం చేశారు. అంత మొత్తం సొమ్ము కనిపించడంతో అంతే బుద్ధిగా పోలీసులకు ఒప్పచెప్పి వారు ఆదర్శంగా నిలిచారని అభినందనలు తెలిపారు.