బ్రిటన్‌ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ..!

Another woman of Indian origin in British cabinet..!
Another woman of Indian origin in British cabinet..!

బ్రిటన్‌ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ చేరారు. రిషి సునాక్ కేబినెట్​లో.. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్‌ కౌటినో మంత్రిగా నియామకమయ్యారు. ఆ దేశ ఇంధన శాఖ మంత్రిగా గురువారం రోజున కౌటినోను ప్రధాని రిషి సునాక్‌ నియమించారు. ప్రస్తుతం ఇంధనశాఖ మంత్రిగా ఉన్న గ్రాంట్‌ షాప్స్‌ రక్షణ మంత్రిగా పదోన్నతి పొందారు.

ఇంధనశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని కౌటినో తెలిపారు. ప్రధాని రిషి సునాక్​తో కలిసి పని చేసి ఇంధన భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఇంటి కరెంటు బిల్లులను తగ్గించేందుకు కృషి చేస్తానని.. శుద్ధ, చౌకైన, స్థానికంగా ఉత్పత్తి చేసే ఇంధనానికి ప్రాధాన్యమిస్తానని కౌటినో వెల్లడించారు.

సునాక్‌ లాగే బ్రిటన్‌లో జన్మించినప్పటికీ ,గణితం, ఫిలాసఫీలో మాస్టర్స్‌ కౌటినో ఆక్స్‌ఫర్డ్‌లో చేశారు. ఈస్ట్‌ సర్రే నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. గతంలో బ్రిటన్‌ ట్రెజరీ విభాగానికి ప్రత్యేక సలహాదారుగా పని చేస్తూ, ఖజానాకు ఛాన్సలర్‌గా, సునాక్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సహాయకురాలిగా కౌటినో పని చేశారు. సునాక్‌ కేబినెట్‌లో పిన్న వయస్కురాలైన మంత్రిగా నియమితురాలయ్యారు.