అచ్చుగుద్దినట్లుగా మొత్తం తాత పోలికలతో దిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్. మరి నటనలో తాతను మరిపించేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ ని అంతా యంగ్ టైగర్ అంటారు. ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ పేలిపోతుంది. 12 మిలియన్లకు పైగా ట్వీట్స్‌తో నెంబర్1 ట్రెండింగ్‌లో ఉంది. కష్టం అంటే తెలిసి.. కష్టాలను ఎదురొడ్డి నిలిచిన ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ.. ఆయన జీవితంలో జరిగిన కొన్ని కీలక విషయాలను తెలుసుకుందాం.
నటుడిగా ‘బాల రామయణం’ సినిమాతో కెరియర్ ను స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఎన్టీఆర్‌ని ఇతను కూడా నట వారసుల బాపతే అని హేళన చేశారు. అయితే ఎన్టీఆర్ అంటే అటొచ్చి.. ఇటెళ్లే బాపతు కాదని తన రెండో సినిమా ‘స్టూడెంట్ నెం.1’తో నిరూపించాడు. రాజమౌళి దర్శకత్వంలో తొలి హిట్ అందుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ సినిమాతో తనలోని కసిని చూపించారు. తొడకొట్టి మరీ బాక్సాఫీస్ ఆది చిత్రంతో శాసించాడు. ఆ తర్వాత తిరిగి మళ్లీ రాజమౌళి ‘సింహాద్రి’ సినిమా ద్వారా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోలకు పోటీ అయ్యాడు.
అంతేకాకుండా సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌గా తాతకు తగ్గ మనువడుగా.. డాన్స్, యాక్షన్ సీన్స్ విషయంలో తాతను మించిపోయేడంటూ మైమరపించాడు. సింహాద్రి తర్వాత కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న ఎన్టీఆర్.. తిరిగి తన రాజమౌళితో ‘యమదొంగ’తో మరో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘అదుర్స్’, బృందావనం, బాద్‌షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత’ వంటి హిట్లతో ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నారు. అయితే అన్ని సినిమా ఒక లెక్క.. త్వరలోనే మళ్లీ రాజమౌళితో రాబోయే ఆర్ఆర్ఆర్ మరో లెక్క అన్నవిధంగా తన స్నేహితుడు, స్టార్ హీరో రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నారు ఎన్టీఆర్.