యూపీలో 50మందికి కరోనా.. అంతా మహా వలస కూలీలే

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తుంది. భారత్ లో కూడా రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో కరోనా కారణంగా అన్నీ బందే చేసి రెండు నెలల పాటు లాక్ డౌన్ లో ఉంది. అయితే ఈ కరోనాతో వలస కూలీల బ్రతుకులు మరింత దిగజారిపోయాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో 50 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ వలస కూలీలంతా గత వారం మహారాష్ట్ర నుంచి సొంత జిల్లా అయిన బస్తీకి చేరుకున్నారు. కూలీలందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారందరికీ సుమారు 50 మందికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. కరోనా బాధితులందరినీ ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా ఈ వలస కూలీలైన 50 మందితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అదేవిధంగా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. కాగా మొత్తంగా బస్తీ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 104కు చేరుకుంది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటివరకు ఆ జిల్లాలో 28 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగతా వారు చికిత్స పొందుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.