యువరాజ్ విషయంలో ధోనీకి ఆ స్వేచ్ఛ ఉంది : కైఫ్

ధోనీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ కెరీర్ గాడి తప్పడానికి కారణం అప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నిర్ణయాలేనని యువీ తండ్రి యోగరాజ్ సింగ్ ఆ మధ్య ఆరోపణలు చేసి పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ధోనీతో పాటు.. కోహ్లీ కూడా యువరాజ్ సింగ్‌‌కి సపోర్ట్‌గా నిలవలేదని యోగరాజ్.. చెప్పుకొచ్చాడు. ఉద్దేశపూర్వకంగానే టీమ్ నుంచి వేటు వేశారని ఆరోపించాడు. కాగా యోగరాజ్ వ్యాఖ్యలపై తాజాగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్రంగా మండిపడ్డాడు. టీమ్‌ని ఎంపిక చేసుకోవడంలో కెప్టెన్‌కి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు కైఫ్. అదేవిధంగా ధోనీ రికార్డ్స్ ను బట్టి అప్పట్లో సెలక్టర్లు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు.

అదేవిధంగా ‘యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలు నిజమని నేను నమ్మలేకపోతున్నాను. యువరాజ్ సింగ్ వన్డే, టీ20ల్లో ఛాంపియన్‌ క్రికెటర్. అయినప్పటికీ అతనికి తగిన అవకాశాలు ఇవ్వలేదు అని నేను నమ్ముతున్నాను. కానీ.. భారత్ జట్టులో ఒక క్రికెటర్ ఫామ్ కోల్పోతే.. తన స్థానాన్ని వేరొకరు కోల్పోవడం సహజం. ఎందుకంటే చాలా మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు టీమ్‌లో చోటు కోసం ఎదురు చూస్తుంటారు. ఇక ధోనీ వైట్ బాల్ క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్.

కాబట్టి.. నచ్చిన టీమ్‌ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ అతనికి ఉంటుంది. అలాగే.. ఆ టీమ్‌తో అతను విఫలమైతే అప్పుడు ప్రశ్నించ వచ్చు. కానీ.. రికార్డులు, ట్రోఫీల పరంగా చూసుకొని సెలక్టర్లు కూడా కెప్టెన్‌ ధోనీ మాటకి అప్పట్లో విలువ ఇచ్చారు. అంతేతప్ప.. అక్కడ ఫేవరెటిజమ్ ఏమీ లేదు’ అంటూ కైఫ్ వివరించారు.  కాగా 2011 వన్డే ప్రపంచకప్ కాలంలో సురేశ్ రైనాని ఆడించేందుకు యువరాజ్ సింగ్‌ని పక్కన పెట్టాలని అప్పట్లో ధోనీ పావులు కదిపినట్లు యోగరాజ్ ఆరోపణాస్త్రాలు సంధించాడు. ఆ తర్వాత కూడా యువీకి పెద్దగా అవకాశాలివ్వలేదని యోగరాజ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.