మామా అల్లుడి కుటుంబికుల మధ్య గొడవ.. మామ మృతి

కోడవలితో దంపతులపై దాడి

తెలంగాణలోని డిచ్ పల్లిలో ఘోరం జరిగింది. కూతురిని కాపురానికి పంపించడం లేదని ఆగ్రహించి ఏకంగా అల్లుడు.. మామపై దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి మామ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో తాజాగా చోటుచేసుకుంది. డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెల్పిన అంశాలను బట్టి చూస్తే.. డిచ్‌పల్లికి చెందిన పసునూరి సందీప్‌ కూతురు శ్రీయను స్థానికంగా ఉండే రేగుంట రాజారాం కొడుకు మహేందర్‌కు ఇచ్చి గత నవంబర్‌లో పెళ్లి చేశాడు.అయితే ఈ మధ్య భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో కొన్ని రోజులుగా శ్రీయ పుట్టింట్లోనే ఉంటుంది. సోమవారం ఉదయం మహేందర్‌ తన తల్లిదండ్రులు రాజారాం, లక్ష్మి, అన్న రవీందర్‌తో కలిసి సందీప్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇరువురి కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇక మహేందర్‌ కుటుంబీకులు సందీప్‌, అతడి అన్న రాజుపై దాడిచేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సందీప్‌ పోలీసు స్టేషన్‌ వెళ్లి తమపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఇంటికి వచ్చిన అతడు ఛాతిలో నొప్పి ఉందని చెప్పి కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో  బంధువులు మృతదేహాన్ని తీసుకుని వచ్చి డిచ్‌పల్లి మండల కేంద్రంలోని డీలర్‌ రాజారాం ఇంటికి చేరుకుని తమకు న్యాయం చేయాలని ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉండగా.. ఈ ఘటనను ముందే పసిగట్టిన నిందితులు ఇంటికి తాళం వేసి పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. దీంతో నిందితుల ఇంటి తలుపులకు ఉన్న అద్దాలను అక్కడే ఉన్న బైక్‌ను ధ్వంసం చేశారు. ఆ విషయాన్ని తెలుసుకున్న సీఐ అక్కడికి చేరుకొని నిరసనకారులకు సర్దుచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అలాగే.. నిందితులను తమకు అప్పగించాలని కోరుతూ సందీప్‌ బంధువులు పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. సందీప్‌ కూతురు శ్రీయ ఫిర్యాదు మేరకు నిందితులు నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.