రాజమండ్రి జైలుకు బాబు … ఖైదీ నంబర్‌ 7691

Babu … prisoner number 7691 to Rajahmundry Jail
Babu … prisoner number 7691 to Rajahmundry Jail

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయినా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్‌ ఇచ్చింది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఈ నెల 22 వరకు విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఏపీ మాజీ ముఖ్య మంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డుమార్గంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. వర్షం కురుస్తుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమహేంద్రవరం చేరుకోవడానికి 5 గంటలకు పైగా పట్టింది. జైలు అధికారులు కోర్టు ఆదేశాల మేరకు బాబు కోసం స్నేహ బ్లాక్‌ ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. ఆయనకు ఖైదీ నంబర్‌ 7691 కేటాయించారు. 300 మంది పోలీసులతో జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే.. జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించేందుకు కోర్టు అంగీకరించింది. భద్రతా కారణాల రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వా లని, చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని కోర్టు సంబంధిత
అధికారులకు ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యే క ఆహారంతో పాటు మెడిసిన్‌ తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశించింది. జైలు దగ్గర ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా భారీగా మొత్తంలో పోలీసులు మోహరించారు. రాజమండ్రికి చంద్రబాబు వెంటే ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా వెళ్లారు. అయితే.. భద్రతా కారణాల రీత్యా ఎవర్నీ కూడా జైలు లోపలి అనుమతించకుండా బయటే నిలిపివేశారు.

అయితే బాబుకు బెయిల్‌ కోసం చంద్రబాబు లాయర్లు ప్రయత్నిస్తున్నారు. ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అదేవిధం గా హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. ఇక బాబును విచారణ నిమిత్తం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు అప్పగించాలని సీఐడీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ ఇచ్చిన బంద్‌ పిలుపుకు జనసేన మద్దతు ఇచ్చింది. ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.