వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంశంపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిన నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తమ అధికారాన్ని పొడిగించుకునేందుకే వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని తెరపైకి తెచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిపించే ఆలోచన ప్రభుత్వానికి లేదని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తోందన్న మంత్రి ఈ సమావేశాల అజెండాను మాత్రం వెల్లడించలేదు. ఈ సమావేశాలను సరైన సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకటిస్తారని చెప్పారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానంపై చర్చ జరుగుతున్న క్రమంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహించడంపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. ఒకే దేశం-ఒకే ఎన్నిక పేరుతో ప్రభుత్వం తన అధికారాన్ని పొడిగించుకోవాలని ప్రయత్నిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.