మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్లో మరికాస్త దూకుడు పెంచారు. జనసేన పార్టీ నేత, మెగాస్టార్ బ్రదర్ నాగబాబు తాజాగా తమదైన శైలిలో సమాజంలో జరుగుతోన్న, జరిగిన తంతును, వాటి పరిణామాలను ఎరుకపరుస్తున్నాడు. దాంతో విమర్శలపాలైతున్నారు. అయితే ఆయన ట్వీట్స్ కు పార్టీకి సంబంధం లేదని.. అవి ఆయన వ్యక్తిగతానికి సంబంధించినవని తాజాగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు కూడాను.
అయితే తాజాగా గాడ్సేపై చేసిన ట్వీట్లతో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తూ నాగబాబు ట్వీట్ చేశారు. వెంకన్న భూములు అమ్మాలంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికరంగా స్పందించారు.. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే.. తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడవలసిన బాధ్యత తిరుపతి పాలకమండలిది అన్నారు నాగబాబు. అంతేకానీ.. స్వామివారి భూములను అమ్మే హక్కు మీకు లేదని.. హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి.. నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను అంటూ కూడా వెల్లడించారు. మరి ఈ ట్వీట్ పై వైసీపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.