ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఘోరం జరిగింది. హాయిగా సాగిపోతున్న కాపురంలో ఉన్నట్టుండి కొత్త సెల్ఫోన్ కలకలం రేపింది. దాంతో దంపతుల మధ్య వైరం పెరిగింది. అలా చెలరేగిన గొడవతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరులో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన నాగరాజుతో నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన పార్వతికి ఆరేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
అయితే ఈ దంపతులు తమకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకు సాగిస్తున్నారు. అలా కూలి పనులకు కూడా వెళ్తుంటారు. ఉన్నట్టుండి నాగరాజు రెండ్రోజుల క్రితం రూ.1500 ఖర్చుపెట్టి కొత్త సెల్ఫోన్ కొన్నాడు. అది పనిచేయక పోవడంతో రిపేర్ చేయించేందుకు రూ.500 ఇవ్వాలని భార్యను అడిగాడు. కాగా లాక్డౌన్ తో పనులు లేక ఇళ్లు గడవడమే కష్టంగా ఉంటే రూ.1500 పెట్టి సెల్ఫోన్ కొనడం అవసరమా? మళ్లీ దాని రిపేర్ కోసం రూ.500 అడుగుతున్నావంటూ పార్వతి భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ పెరిగింది. దాంతో నాగరాజు భార్యను తిట్టి కోపంతో బయటకు వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పిల్లాడి ఊయల కోసం వేసిన చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి తర్వాత భర్త ఇంటికొచ్చి చూడగా.. భార్య ఉరికి వేలాడటాన్ని చూసి షాక్ కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.