Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా వేదికగా నేచురల్ స్టార్ నాని మీద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అయితే బిగ్ బాస్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలకు నాని స్పందించి ఆమెకు లీగల్ నోటీసులు పంపించాడు.`సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంద`ని కామెంట్ చేస్తూ శ్రీరెడ్డికి పంపిన లీగల్ నోటీసును తన ట్విటర్ ఖాతాలో నాని పోస్ట్ చేశాడు. దానికి శ్రీరెడ్డి స్పందించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణంగా ట్విట్ చేసింది. అయితే తాజాగా ఈ వివాదంపై తమిళ హీరో విశాల్ స్పందించాడు.
‘చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఒప్పుకుంటాను. కానీ, ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం కరెక్టు కాదని తనకు నాని గురించి తెలుసని అన్నాడు. అతను నాకు మంచి స్నేహితుడు, వ్యక్తిగత కారణాల రీత్యా నానికి మద్దతు తెలపడం లేదు. కానీ నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు వివాదాస్పదం. నాని గురించి తెలిసిన వారికి అతను మహిళల పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో తెలుసు. ఒకవేళ శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే కేవలం పేర్లు బయటపెడితే సరిపోదు. ఆధారాలు చూపించాలి. ఆమె వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఇతరులను ఇష్టం వచ్చినట్లు టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. మున్ముందు నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమోనని విశాల్ అనుమానం వ్యక్తం చేశాడు..
మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి సరైన చట్టాల్లేవు. ఏ మహిళైనా ఇతరులపై ఆరోపణలు చేస్తే చట్టం దానిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఆరోపణలు చేసేవారికే మద్దతు ఇస్తోంది. ఇది సరైనది కాదని పేర్కొన్నాడు.‘తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఓ వ్యక్తి తనకు తాను నిర్మాతనని చెప్పుకుని ఆడవాళ్లను ఆడిషన్లకు రమ్మంటాడు. అలా ఆడిషన్ పేరుతో ఆడపిల్లల్ని మోసం చేయడం చాలా తప్పు. సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉంది. ఊరు, పేరు తెలియని వ్యక్తులు ఆఫీస్ తెరిచి నేను నిర్మాతను, నేను దర్శకుడిని అనిచెప్పి వేషాల కోసం వచ్చేవారిని ఆడిషన్స్ చేస్తున్నారు. అలా వచ్చే అమ్మాయిలను వాడుకొంటున్నారు. ఇది తెలుగు, తమిళ పరిశ్రమలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని విశాల్ అన్నారు.