Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. ముందుగా వార్తలు వచ్చినట్టుగానే ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్ , ఆయన భార్య సమ్మక్క, మరో ముఖ్య నేత బడే చొక్కారావు సహా పదిమంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మరణించారని పోలీసులు ప్రకటించారు. ఎదురుకాల్పుల్లో తాము పోలీస్ కమాండర్ సుశీల్ ను పోగొట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం హరిభూషణ్ తెలంగాణ మావోయిస్టు కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటినుంచి ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజన్ లో కార్యకలాపాలు పెంచడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్టు నిఘా వర్గాలకు సమాచారం ఉంది.
మావోయిస్టు అగ్రనేతగా హరిభూషణ్ ఎప్పటినుంచో పోలీసుల హిట్ లిస్టులో ఉన్నారు. రూ. 30లక్షల రివార్డు ఉన్న ఆయనకోసం ప్రత్యేక ఆపరేషన్లు కూడా జరిగాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు 2016 మార్చి 2న జరిగిన ఎన్ కౌంటర్ లో సౌత్ సెంట్రల్ జోన్ కార్యదర్శి లచ్చన్న సహా ఏడుగురు దళ సభ్యులు చనిపోయారు. ఆ ఎన్ కౌంటర్ లో హరిభూషణ్ కూడా చనిపోయాడని ఛత్తీస్ గఢ్ పోలీసులు ప్రకటించారు. కానీ తెలంగాణ పోలీసులు ఆ ప్రకటనను కొట్టిపారేశారు. అయితే ఆ సమయంలో హరిభూషణ్ ను పోలీసులు పట్టుకున్నారని, అప్పటినుంచి ఇప్పటిదాకా రహస్య ప్రాంతంలో విచారించి..ఇప్పుడు బూటకపు ఎన్ కౌంటర్ లో హతమార్చారని మావోయిస్టు సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు హైకోర్టును ఆశ్రయించారు. ఇది బూటకపు ఎన్ కౌంటరని, దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మావోయిస్టు నాయకులను పోలీసులు ముందుగానే పట్టుకుని, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. కాగా..ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ గాయపడినట్టు సమాచారం.