అక్తర్‌పై రూ. 10 కోట్ల పరువు నష్టం

అక్తర్‌పై రూ. 10 కోట్ల పరువు నష్టం

పాకిస్థాన్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌కు అదే దేశానికి చెందిన ప్రముఖ క్రీడా ఛానల్‌ పీటీవీ దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. అక్తర్‌పై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ముందస్తు సమాచారం లేకుండా ఛానల్‌ నుంచి వైదొలిగాడని, నిబంధనలకు విరుద్ధంగా టీ20 ప్రపంచకప్‌-2021 వేదిక అయిన దుబాయ్‌ విడిచి వెళ్లిపోయాడని, తద్వారా తమ సంస్థకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందంటూ పీటీవీ.. అక్తర్‌కు నోటీసులు జారీ చేసింది. అక్తర్‌.. భారత క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌తో కలిసి ఓ ఇండియన్‌ టీవీ షోలో పాల్గొనడం వల్ల తమకు నష్టం కలిగిందని పీటీవీ నోటీసుల్లో పేర్కొంది.

ఇందుకుగాను అక్తర్‌ తన మూడు నెలల జీతంతో పాటు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాలంటూ దావా వేసింది. ఇలా జరగని పక్షంలో అక్తర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య అక్టోబర్‌ 26న జరిగిన మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన పీటీవీ లైవ్‌ షోలో అక్తర్‌కు ఘోర అవమానం జరిగింది. ఆ లైవ్‌ షోలో ప్రముఖ పాకస్థానీ వ్యాఖ్యాత, హోస్ట్‌ డాక్టర్‌ నౌమాన్‌ నియాజ్‌ అక్తర్‌ను లైవ్‌ లోనుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన అక్తర్‌.. మైక్‌ను విసిరేసి షో నుంచి వాకౌట్‌ చేశాడు. అనంతరం ఆ టీవీ ఛానల్‌తో తనకున్న ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నాడు.