రాష్ట్రంలో తొలి డోసు వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి

రాష్ట్రంలో తొలి డోసు వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి

తెలంగాణలో జనవరి 3వ తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో తొలి డోసు వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ కేక్ కట్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.వంద శాతం తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింద‌ని, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామని అన్నారు.

మొద‌టి నుంచి సీఎం కేసీఆర్ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఆయ‌నే స్వయంగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారని వివరించారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యమయ్యాయన్నారు. ప్రభుత్వంలోని ప్రతి ఒక్క శాఖ సహకారంతో ఇది సాధ్యమైందని.. అందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.ఇక రాష్ట్రంలో 100% మొదటి డోసు, 66% రెండో డోసు పూర్తయిందని హరీశ్ చెప్పారు.

ఇక జాతీయ సగటు మొదటి డోసు 90 శాతం ఉండగా, రెండో డోసు 63 శాతంగా ఉందన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటు కంటే ముందే ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ వాక్సిన్ కేంద్రాల్లో 87 శాతం వాక్సినేషన్ జరగ్గా, 13% ప్రైవేటు‌లో జరిగిందని చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో వ్యాక్సిన్లకు కొరత లేకపోవడంతోపాటు 30 లక్షల డోసులు నిల్వ ఉన్నాయన్నారు.

జనవరి 3 నుంచి 15-18 వయసు వారికి.. జనవరి 10 నుంచి 60 ఏళ్లపై బడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని హరీశ్ వివరించారు. ముందుగా హైదరాబాద్‌తో పాటు మున్సిపాలిటీల్లోని పీహెచ్‌సీ, ఆపై స్థాయి ఆస్పత్రిలో ఉన్న చోట్ల వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు.. ఆ తర్వాత గ్రామ స్థాయికి ఇస్తామన్నారు. అయితే వ్యాక్సిన్ కోసం మున్సిపాలిటీల్లో తప్పనిసరిగా కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,970 వాక్సినేషన్ బృందాలు పని చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.