Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తియాన్ మెన్ స్క్వేర్… ఈ పేరు వినగానే ప్రపంచం ఉలిక్కిపడుతుంది. ప్రజాస్వామ్యం కోసం నినదించిన చైనా పౌరులపై ఆ దేశ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఈ ప్రాంతంలోనే. పోరాటయోధులపై చైనా సైన్యం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి వేలమందిని హతమార్చింది. వారు చేసిన నేరమల్లా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వద్దనడమే. ప్రపంచంలోని మిగిలిన దేశాల్లా ప్రజాస్వామ్యపాలన కావాలని డిమాండ్ చేస్తూ దాదాపు ఏడువారాల పాటు చైనా పౌరులు వీధుల్లోకొచ్చి పోరాటాలు చేశారు. 1989 మే నెలలో ఈ పోరాటం మొదలయింది.
జూన్ 5న పౌరులంతా తియాన్ మెన్ స్క్వేర్ వద్దకు చేరుకుని నినాదాలు చేస్తుండగా…సైన్యం విచక్షణారహితంగా విరుచుకుపడింది. ఆ కాల్పుల్లో ఎంతమంది పౌరులు చనిపోయారనేదానిపై అధికారికంగా లెక్కలేదు. ఒక వెయ్యిమంది చనిపోయారని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రపంచానికి చెప్పినప్పటికీ ఎవరూ దాన్ని నమ్మలేదు. చైనా ప్రకటించిన దానికన్నా ఎక్కువమందే చనిపోయి ఉంటారని తెలిసినప్పటికీ కచ్చితమైన లెక్కలు లేవు. కాలక్రమంలో ఆ విషయం మరుగునపడిపోయింది. తాజాగా బ్రిటన్ రహస్య దౌత్య సమాచార విభాగం దీనికి సంబంధించి ఓ సంచలన విషయం తెలియజేసింది.
తియాన్ మెన్ స్క్వేర్ వద్ద ఆనాడు జరిగిన కాల్పుల్లో దాదాపు 10వేలమందిని చైనా సైన్యం చంపివేసిందని వెల్లడించింది. అప్పటి బ్రిటన్ రాయబారి అలాన్ డోనాల్డ్ లండన్ కు పంపిన టెలిగ్రాంలో ఈ విషయాన్ని తెలియజేశారు. బ్రిటన్ రహస్య దౌత్య సమాచారవిభాగం దాచిఉంచిన ఈ టెలిగ్రాం ఇప్పుడు వెలుగుచూడడంతో చైనా కమ్యూనిస్టుప్రభత్వం చేసిన హత్యలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. అటు ప్రాణాలొడ్డి పోరాడినా ఆ పదివేల మంది పౌరుల త్యాగం ఫలించలేదు. చైనాలో కమ్యూనిస్టుప్రభుత్వమే ఇప్పటికీ పాలన సాగిస్తోంది