రాష్ట్ర‌ప‌తి చేతుల‌మీద‌గా అంద‌రూ అవార్డు అందుకోలేరు…

11 Members Only Will Receive National Awards From President Kovind

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ తీసుకున్న ఓ నిర్ణ‌యంపై సినీవ‌ర్గాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నాయి. ఈ సాయంత్రం జ‌ర‌గ‌నున్న 65వ జాతీయ అవార్డుల ప్ర‌దానం కార్య‌క్ర‌మానికి రాష్ట్ర‌ప‌తి గంట స‌మ‌యం మాత్ర‌మే కేటాయిస్తార‌ని, కేవ‌లం 11 మందికి మాత్ర‌మే ఆయ‌న చేతుల మీద‌గా అవార్డులు ప్ర‌దానం చేస్తార‌ని రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ప్ర‌క‌టించ‌డం దుమారం లేపింది. రాష్ట్ర‌ప‌తి నిర్ణ‌యంపై అవార్డు విజేత‌లు చాలా మంది అసంతృప్తి వ్య‌క్తంచేశారు. ఇలా చేస్తే కార్య‌క్ర‌మాన్ని అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అలాగే అవార్డుల విజేత‌లు 140 మందిలో ప్ర‌తి ఒక్క‌రితో క‌లిసి ఫొటోలు దిగే స‌మ‌యం రామ్ నాథ్ కోవింద్ కు లేక‌పోవ‌డంతో, 45 మంది విజేత‌ల బృందంతో క‌లిసి ఆయ‌న ఫొటోలు దిగుతార‌ని తెలుస్తోంది. 65 ఏళ్ల జాతీయ అవార్డుల చ‌రిత్ర‌లో ఇలా రాష్ట్ర‌ప‌తి కొంద‌రికే అవార్డులు ప్ర‌దానం చేయ‌డం…ఎప్పుడూ లేదు.

1954లో జాతీయ అవార్డులు ప్ర‌వేశపెట్టిన ద‌గ్గ‌ర‌నుంచి…జాతీయ అవార్డులు గెలుచుకున్నవారందరికీ…రాష్ట్ర‌ప‌తి అవార్డులు ప్ర‌దానం చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. 64 ఏళ్ల‌గా వ‌స్తున్న సంప్ర‌దాయంలో ఇప్పుడు మార్పులు చేయ‌డంపై ప్ర‌ముఖులు నిరాశ వ్య‌క్తంచేస్తున్నారు. ప్ర‌సంగాల స‌మ‌యం త‌గ్గించి అంద‌రికీ అవార్డులు ప్ర‌దానం చేయాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా  మ‌ధ్యాహ్నం 3.30 నుంచి 5.30 వ‌ర‌కు జరిగే కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ 75 మందికి, వివిధ శాఖ‌ల మంత్రులు మిగిలిన వారికి అవార్డులు ప్ర‌దానం చేయనున్న‌ట్టు స‌మాచారం. మరోవైపు వ‌చ్చే ఏడాది నుంచి రాష్ట్ర‌ప‌తి కేవ‌లం ఒక్క అవార్డు మాత్ర‌మే బ‌హూక‌రిస్తార‌ని, మిగిలిన అవార్డుల‌ను మంత్రుల‌తో ప్ర‌దానం చేయించాలంటూ రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం కేంద్ర‌ప్ర‌భుత్వానికి తెలియ‌జేసింది. ఈ నిర్ణ‌యాలు ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారాయి.