ఏక్ దమ్… 12 కుక్కలు మృతి.. భయం గుప్పెట్లో జనం

కరోనా వైరస్ ఓ పక్క విశ్వాన్ని వణికస్తుంటే… మరో పక్క సమాజాన్ని వింత వింత ఘటనలు మరింత భయానికి గురి చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఉన్న‌ట్టుండి మూగ‌జీవాలు మృత్యువాత ప‌డుతుండ‌టం అందరినీ క‌ల‌వ‌ర పెడుతుంది. ఇప్ప‌టికే కోవిడ్- 19 వైర‌స్ కోర‌ల్లో చిక్కుకున్న తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లాను ఇప్పుడు మ‌రో కొత్త భ‌యం వెంటాడుతోంది. అంతుచిక్క‌ని రోగంతో ప‌దుల సంఖ్య‌లో వీధి కుక్క‌లు మ‌ర‌ణించ‌టంతో జిల్లా వాసులు మరింత భయాందోళనలకు గురౌతున్నారు.

తాజాగా పెద్దపల్లి జిల్లాలోని ఓడేడ్ గ్రామంలో వరుసగా వీధి కుక్కలు మరణిస్తుండటం కలక‌లం రేపుతోంది. హఠాత్తుగా… 12 కుక్కలు మరణించడంతో ఏం జరిగిందోనని గ్రామ‌స్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ఓ జూలో పులికి కూడా కరోనా వ్యాపించడంతో కుక్కలకు కూడా ఏదైనా వింత రోగం వచ్చిందా?  ఏమిటి అని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పశువైద్యాధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

అంతేకాకుండా గ్రామంలో మూడు రోజుల క్రితం కరోనా వైరస్ ప్రభలకుండా ఉండటానికి శానిటైజర్లు చల్లారు. హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడంతో అది పడిన ఆహారం, నీరు తాగడం వల్ల కూడా కుక్కలకు ఇలా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిచికారీ చేసిన తర్వాతే శునకాలు మరణిస్తున్నందున ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. ఇంకా లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో వాటికి తిండిలేక కూడా మరణించే అవకాశం ఉందంటున్నారు మరికొందరు.