కొండగట్టు బస్సు ప్రమాదం మిగిల్చిన కన్నీళ్ళ చెమ్మ ఇంకా ఆరక ముందే మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో మినీ బస్సు చినాబ్ నదిలో పడిన ఘటనలో 11 మందికి పైగా చనిపోయారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారికి స్థానిక ఆస్పత్రులకు తరలించారు. థాక్రీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చాలా మందికి గాయాలైనట్టు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
యాత్రికులతో వెళుతున్న మినీ బస్సు అతివేగం కారణంగా అదుపు తప్పి రోడ్డుపై నుంచి పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి చినాబ్ నదిలో పడిపోయింది. తీవ్రగాయాలతో కొందరు, నీట మునిగి మరికొందరు మరణించారు. అతి వేగం వల్లే బస్సు అదుపు తప్పి లోయలోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బాధితులకు తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన మినీ బస్సు నంబర్‌ను JK17 0662గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.