Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని నేరాలు గమనిస్తే… భయంతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలు పాల్పడే నేరాలు విస్తుగొలుపుతుంటాయి. అంత చిన్నవయసులో… ఆలోచనలు కూడా పూర్తిగా వికసించని చిరుప్రాయంలో అంతపెద్ద నేరాలు ఎలా చేయగలుగుతారా అన్న సందేహం తలెత్తుతుంది. రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రద్యుమ్న ఠాకూర్ ను హత్య చేసిన 11వ తరగతి విద్యార్థిని చూసే దేశం యావత్తూ ఉలిక్కిపడింది. పరీక్ష వాయిదా వేయడం కోసం తోటి విద్యార్థి ప్రాణం తీసిన ఆ సీనియర్ స్టూడెంట్ ను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆ అబ్బాయి వయసు 16 సంవత్సరాలు. లోకజ్ఞానం బాగానే తెలిసే వయసు. అయినా సరే ఆ విద్యార్థి తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా అంతకన్నా దారుణమైన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. తన ప్రేమకు అడ్డు చెప్పిందన్న కోపంతో ఓ 12 ఏళ్ల బాలిక, తన 15 ఏళ్ల ప్రియుడితో కలిసి పెంపుడుతల్లిని హతమార్చింది.
వివరాల్లోకి వెళ్తే… ఫతేపూర్ కు చెందిన 12 ఏళ్ల బాలిక ఏడో తరగతి చదువుతోంది. ఆ బాలిక అనాథ. అమ్మానాన్నలు, బంధువులు ఎవరూ లేరు. అనాథశ్రమంలో ఉన్న ఆ బాలికను మూడు నెలల వయసు ఉన్నప్పుడు ఓ మహిళ దత్తత తీసుకుంది. అప్పటినుంచి ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసింది. బాలికకు 12 ఏళ్ల వయసు వచ్చింది. తన పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడ్ని ప్రేమించింది. తల్లికి తెలియకుండా అతన్ని రహస్యంగా కలుసుకుంటూ ఉండేది. ఓ రోజు విషయం తెలియడంతో తల్లి ఈ వయసులో ఇలాంటివి మంచిది కాదని హెచ్చరించింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న ఆ బాలిక తల్లి అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఆదివారం అర్ధరాత్రి ప్రియుణ్ని ఇంటికి పిలిపించి అతడితో కలిసి తల్లి గొంతు పిసికి చంపివేసింది. అనంతరం తల్లి వద్ద నున్న ఫోన్లు పగలగొట్టింది. సోమవారం ఉదయం ఏమీ తెలీనట్లు పక్కింటికి వెళ్లి తన తల్లి అపస్మారక స్థితిలో ఉందని ఏడ్చింది. దాంతో వారు వైద్యుణ్ని పిలిపించగా ఆమె మృతిచెందినట్టు తెలిసింది. అయితే అంత్యక్రియలు జరిపే సమయంలో గొంతుపై గాయాలు ఉండడంతో పక్కింటి వ్యక్తికి అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఆ బాలికను విచారించగా పెంపుడు తల్లిని తానే ప్రియుడితో కలిసి చంపినట్టు తెలిపింది. ఇద్దరు పిల్లలనూ అరెస్ట్ చేసిన పోలీసులు వారిని జువైనల్ హోంకు తరలించారు.