ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అమరావతి ప్రాంతానికి చెందిన రైతులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా రైతులు ఆందోళన చేపట్టి నేటికీ 10వ రోజు. ఈమేరకు రాష్ట్ర రాజధాని ని అమరావతి నుండి మార్చకండి అని రైతులందరూ కూడా రోజుకో వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు నేడు (శుక్రవారం నాడు) రహదారిపై మహాధర్నా నిర్వహించి, తమ నిరసనను తెలియజేయడానికి నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా వెలగపూడి, కృష్ణాయపాలెం, ఉద్దండరాయినిపాలెం లో కూడా నిరసనలు రిలే నిరాహార దీక్షలు ఎదావిదిగా కొనసాగనున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన నేడు రాష్ట్రంలో జరగనున్న కేబినెట్ సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. కాగా సచివాలయంలో నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రాజదానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అమరావతి రైతులకు ఊరట కలిగించే పలు కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకోనున్నారు. అయితే ఈ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడతో పాటు గుంటూరు నుంచి సచివాలయానికి వెళ్లే అన్ని దారులను దిగ్బంధం చేస్తున్నారు. అంతేకాకుండా తుళ్లూరు మండలంలో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పొలీసు బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.