Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి జడలు విప్పింది. స్కూల్ నుంచి తనను సస్పెండ్ చేశారనన్న అక్కసుతో 19 ఏళ్ల విద్యార్థి భీకర కాల్పులకు తెగబడ్డాడు. ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో కల మర్జోరీ స్టోన్ మన్ డగ్లస్ స్కూల్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. కాల్పుల్లో 17 మంది విద్యార్థులు మృతిచెందారు. 14 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణానికి ఒడిగట్టింది డగ్లస్ స్కూల్ మాజీ విద్యార్థి నికోలస్ క్రూజ్. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. నికోలస్ ప్రవర్తన బాగాలేదని, క్రమశిక్షణ తప్పాడని గత ఏడాది అతన్ని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న నికోలస్ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. స్కూల్లోకి ప్రవేశించిన వెంటనే విచక్షణా రహితంగా కాల్పులకు వడిగెట్టాడు. నికోలస్ ను అడ్డుకోవడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించగా… నిర్ధాక్షిణ్యంగా వారిని కాల్చివేశాడు. అనంతరం స్కూల్లోని ఫైర్ అలారమ్ మోగించాడు. అది విన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏదో జరిగిందన్న ఆందోళనతో ఎంట్రన్స్ వైపు పరుగులు తీశారు. అక్కడే కాచుక్కూర్చున్న నికోలస్ వారిపై కాల్పులకు దిగడంతో అంతా భయానక వాతావరణం ఏర్పడింది.
కాల్పుల నుంచి తప్పించుకునేందుకు అక్కడి వారు నలుదిక్కులకూ పరుగులు తీశారు. ఎక్కడికక్కడ రక్తధారలతో స్కూల్ క్యాంపస్ భీతావహంగా మారింది. కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారు. వారిని చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన దుండగుడు స్కూల్ భవనంలో దాక్కున్నాడు. అనంతరం పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నికోలస్ దుర్మార్గంపై అతనికి చదువు చెప్పిన టీచర్లు స్పందించారు. మొదటినుంచీ నికోలస్ ప్రవర్తన ఇలాగే ఉండేదని వారు చెప్పారు. తోటి విద్యార్థులను బెదిరిస్తూ ఉండేవాడని, మిమ్మల్ని కాల్చేస్తా అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడేవాడని తెలిపారు. ఎల్లప్పుడూ ఎవరో ఒకరితో గొడవపడేవాడని, స్కూల్ గోడలకు తన చేతులను బలంగా కొట్టుకునేవాడని తోటి విద్యార్థులు అంటున్నారు. నికోలస్ వల్ల మిగతా విద్యార్థులకు ప్రమాదం ఉందని భావించిన యాజమాన్యం అతన్ని స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది.
స్కూల్లోనే కాదు… తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా గమనించినా అతని వైఖరి అర్ధమవుతోంది. తుపాకీలను చాలా ఇష్టపడే నికోలస్ ఎప్పుడూ తుపాకీ పట్టుకుని ఫొటోలు తీసుకునేవాడు. అంతేకాకుండా బల్లి, కప్ప వంటి చిన్న చిన్న జీవులను చిత్రహింసలు పెట్టి చంపివేసి వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందపడేవాడు. ఇలాంటి వింత ప్రవర్తనతో ఉండే నికోలస్ కొన్ని రోజుల క్రితం సంభవించిన సోదరి మరణంతో మరింత రాక్షసుడిగా మారాడు. సోదరి దూరమయిన తర్వాత నుంచి నికోలస్ తీవ్ర ఉద్వేగానికి… ఒత్తిడికి లోనై సమాజంపై మరింత విద్వేషాన్ని పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.