ఆ యువకుడి వయస్సు 19ఏళ్లు. ఆ వయస్సు వాళ్ళు చదువుకుంటూనో లేక, ఏదైనా పని చేసుకుని తల్లిదండ్రులకు చేదోడువాదోడుగానో ఉంటారు. అయితే నిండా రెండు పదుల వయస్సు నిండకుండానే తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యువకుడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడి చిన్నకుమారుడు గాంధీ(19) పెళ్లి చేయాలంటూ కొద్దిరోజులుగా తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. జీవితంలో స్థిరపడకుండా పెళ్లి చేసుకుంటే భార్యను ఎలా పోషిస్తావంటూ వారు తిట్టి ఏదైనా పని చూసుకోమని సలహా ఇచ్చారు. అయితే గ్రామంలో తన తోటి వయస్సు వారిలో చాలామంది ఇప్పటికే పెళ్లిళ్లు అయ్యాయని, తనకు మాత్రం కావడం లేదని గాంధీ రోజూ తల్లిదండ్రుల వద్ద బాధపడేవాడు. కొడుకు ఊర్లోనే ఉంటే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమోనని ఆందోళన పడిన తల్లిదండ్రులు అతడిని ఉపాధి నిమిత్తం రైల్వేకోడూరుకు పంపించారు. శుక్రవారం ఇంటికి వస్తున్నట్లు ఇంటికి ఫోన్ చేసిన గాంధీ గురువారం రాత్రే అక్కడికి చేరుకుని సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం స్థానికులు ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు షాకయ్యారు. విగతజీవిగా పడివున్న గాంధీని చూసి కన్నీరుమున్నీరయ్యారు.