Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అణ్యాయుధాలు ప్రయోగిస్తామంటూ అమెరికాను రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా… తానే స్వయంగా ప్రమాదంలో చిక్కుకుని భారీగా నష్టపోయింది. ఉత్తరకొరియా పుంగేరి ప్రాంతంలోని అణుప్రయోగ స్థలంలో ఓ భారీ సొరంగం కుప్పకూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అక్టోబరు 10న మిలిటరీ సైట్ వద్ద నిర్మాణ పనులు చేపడుతుండగా ఒక్కసారిగా సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మంది మృత్యువాత పడ్డారు. తొలుత సొరంగంలో వంది మంది చిక్కకుపోగా..వారిని రక్షించడానికి సహాయకబృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలు సాగుతుండగానే… సొరంగం మిగిలిన భాగం కుప్పకూలిపోయింది. దీంతో మరో వందమంది మృత్యువాత పడ్డారు. జపాన్ మీడియా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ ఘోర ప్రమాదానికి ఉత్తరకొరియా స్వయంకృతాపరాధమే కారణం.
ఉత్తరకొరియా ఇటీవల హైడ్రోజన్ బాంబు పరీక్షించిన స్థలంలోనే ఈ ప్రమాదం జరిగింది. భూఉపరితలానికి సమీపంలో అణుప్రయోగాలు చేస్తే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయని నిపుణులు ముందే హెచ్చరించారు. చైనా సరిహద్దు వద్ద ఉన్న పర్వతాలు కూలిపోయి రేడియేషన్ లీకయ్యే ప్రమాదముందని తెలిపారు. అయినా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వారిమాటలను లెక్కచేయకుండా శాస్త్రవేత్తలతో హైడ్రోజన్ బాంబు పరీక్ష చేయించారు. ఇది జరిగిన కొన్నిరోజుల్లోనే ఘోర ప్రమాదం జరిగి 200 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. జపాన్ మీడియా ప్రసారంచేసిన ఈ వార్తపై ఉత్తరకొరియా నుంచి ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు. ఈ దుర్ఘటన తరువాత అయినా ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షలు నిలిపివేయాలని ప్రపంచదేశాలు కోరుతున్నాయి.
నిజానికి అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు అణ్వస్త్ర సామర్థ్యముంది. కానీ ఆయా దేశాలన్నీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్న తర్వాతే ఈ ప్రయోగాలు జరుపుతున్నాయి. ఉత్తరకొరియా పరిస్థితి దీనికి భిన్నం. శత్రుదేశాలకు దీటుగా అణుసామర్థ్యం సమకూర్చుకోవాలన్న ఆతృతలో ఉత్తరకొరియా సామాన్యుల ప్రాణాలను బలిపెడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అణుపరీక్షలు జరిపే ప్రాంతాల్లో అప్పుడప్పడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. రష్యాలోని చెర్నోబిల్ ఇందుకు ఉదాహరణ.
1986 ఏప్రిల్ 26 తెల్లవారుజామున చెర్నోబిల్ అణువిద్యుత్కేంద్రంలో నాలుగో రియాక్టర్ వద్ద సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తుండగా… భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అప్పటికప్పుడే మృతిచెందగా… పేలుడు వల్ల వెలువడిన అణుధార్మికత ప్రభావం వల్ల తదనంతరకాలంలో మరో 28 మంది చనిపోయారు. ఈ ఘటన అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అణుఇంధన భద్రతపై అనేక సందేహాలు లేవనెత్తింది. జపాన్ లో పెను భూకంపం తరువాతా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. పుకుషిమా అణువిద్యుత్కేంద్రంలోని రియాక్టర్లు దెబ్బతిని రేడియేషన్ లీకయింది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే అణు భద్రత విషయంలో గ్యారంటీ లేనప్పుడు ఉత్తరకొరియా లాంటి దేశాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. చెర్నోబిల్ దుర్ఘటనను నిపుణులు ఎవరూ ఊహించలేదు. కానీ ఉత్తరకొరియా పరిస్థితి అలా కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే..ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయని హెచ్చరికలు చేస్తున్నా…కిమ్ పెడచెవిన పెడుతూ దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు.