పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ అనాధికారికంగా.. నిర్వహిస్తున్న బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు దెబ్బకు రెండు భవనాలు కుప్పకూలగా.. చుట్టు పక్కల వాహానాలన్ని ద్వంసం అయ్యాయి. కిలో మీటర్ల మేర.. ఉన్న బిల్డింగుల అద్దాలన్ని పేలుడు ప్రకంపనలకు పగిలిపోయాయంటే.. ప్రమాదం ఎంత దారుణంగా జరిగిందో. బటాలా ప్రాంతంలో జనావాసాల మధ్య బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు భారీ పేలుడు జరిగింది.
ప్రమాద దాటికి ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోవడంతో.. 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది భారీ సంఖ్యలో ప్రమాదస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడు తీవ్రతకు బాణాసంచా ఫ్యాక్టరీ నేలమట్టం కాగా, పలువురు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బటాలా దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి రాజేందర్ సింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేల రూపాయలు, స్వల్పంగా గాయపడ్డవారికి 25 వేలు నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గురుదాస్‌పూర్ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. బటాలా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.