24 కిస్సెస్ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

24 Kisses Movie Review And Rating

నటీ నటులు : ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి
సంగీతం : జోయ్ బ‌రువా
సినిమాటోగ్రఫీ : ఉద‌య్ గుర్రాల‌
నిర్మాత : స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి
రచన-ద‌ర్శ‌కుడు : అయోధ్య‌కుమార్ క్రిష్ణంసెట్టి

ayodhya kumar krishnamsetty

అర్జున్‌రెడ్డి… ఆర్‌.ఎక్స్‌.100 చిత్రాలు విజ‌యం అందుకొన్నాక బోల్డ్ కంటెంట్‌కి ప్రాధాన్యం పెరిగింది. ఘాటైన స‌న్నివేశాలతో యువ‌త‌రాన్ని ఆక‌ర్షించొచ్చ‌నే అభిప్రాయానికొస్తున్నారు చాలామంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. అందుకే క‌థ కంటే కూడా బోల్డ్ కంటెంట్‌పైనే ఎక్కువ‌గా దృష్టిపెడుతూ సినిమాలు తీస్తున్నారు. `మిణుగురులు` లాంటి ఒక విభిన్న‌మైన సినిమాని తీసి కొత్త ఆలోచ‌న‌లున్న ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న అయోధ్య‌కుమార్ కృష్ణంశెట్టి కూడా అదే ప్ర‌య‌త్నం చేశాడు. `24 కిస్సెస్‌` అంటూ పేరులోనే ముద్దుల్ని మూట‌గ‌ట్టుకొన్న ఈ చిత్రం ఎలా ఉంది? ప‌్ర‌చార చిత్రాల‌తో కావ‌ల్సినంత ప్ర‌చారం చేసుకొన్న ఈ చిత్రం ఏ మేరకు మెప్పించింది ? అనేది సమీక్షలో చూద్దాం.

కధ :

Hebah Patel's 24 Kisses Movie
మెంటల్ డాక్టర్ మూర్తి (రావు రమేష్)తో తన ముద్దు పురాణం చెప్పుకొస్తూ కథను మొదలు పెడతాడు హీరో ఆనంద్ (అరుణ్ అదిత్). ఆనంద్, శ్రీల‌క్ష్మి (హెబ్బా ప‌టేల్‌) ఈ ఇద్ద‌రికీ సినిమాలంటే ప్రేమ‌. ఆనంద్ చిన్న పిల్ల‌ల చిత్రాలు తీసే ద‌ర్శ‌కుడు. శ్రీల‌క్ష్మి ఏమో మాస్ క‌మ్యూనికేష‌న్ చదువుతూ ల‌ఘు చిత్రాలు తీస్తుంటుంది. వ‌ర్క్‌షాప్ వ‌ల్ల ఆనంద్‌, శ్రీల‌క్ష్మి మ‌ధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆనంద్‌కి ప్రేమ‌, పెళ్లిపై న‌మ్మ‌కం ఉండ‌దు. శ్రీలక్ష్మి మాత్రం అందుకు భిన్నం. అనుకోకుండా ఓ సంద‌ర్భంలో ఆనంద్‌, శ్రీలక్ష్మిని త‌ల‌ మీద ముద్దు పెట్టుకుంటాడు. అస‌లు ఆనంద్ త‌ల‌పై ముద్దు ఎందుకు పెట్టాడ‌నే విష‌యాన్ని ఇంట‌ర్నెట్‌లో చూసిన‌ప్పుడు శ్రీల‌క్ష్మికి 24 ముద్దులు గురించి ఓ విష‌యం తెలుస్తుంది. 24 ముద్దులు పెట్టుకున్న జంట విడిపోద‌నే విష‌యం కూడా ఆమెకు తెలుస్తుంది.

Adith Arun
వివిధ సంద‌ర్భాల్లో ఆనంద్‌, శ్రీల‌క్ష్మి ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. 13 ముద్దులు పూర్త‌యిన త‌ర్వాత ఆనంద్‌కు త‌న‌ను ప్రేమించ‌డం లేద‌నే విష‌యం తెలిసి అత‌నితో గొడ‌వ‌ప‌డి వెళ్లిపోతుంది. మ‌ళ్లీ క‌లుసుకుంటారు. 23 ముద్దుల త‌ర్వాత అస‌లు ఆనంద్‌కు పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం లేద‌నే విష‌యం తెలుస్తుంది. అంతే కాకుండా అప్ప‌టికే త‌న‌కు ఇద్ద‌రు, ముగ్గురితో శారీర‌క సంబంధాలున్నాయ‌ని తెలుసుకుని గొడ‌వ‌ప‌డి త‌న‌ను ఎప్పుడూ క‌ల‌వొద్ద‌ని వెళ్లిపోతుంది. అస‌లు ఆనంద్‌కు పెళ్లంటే ఎందుకు ఇష్టం ఉండ‌దు? పిల్ల‌ల స‌మ‌స్య‌ల గురించి పోరాడే వ్య‌క్తికి పిల్ల‌లంటే ఎందుకు ఇష్టం ఉండ‌దు అనే విష‌యాలు అనే విష‌యాల్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

Director Ayodhya Kumar

ద‌ర్శ‌కుడు అయోధ్య కుమార్ మూడేళ్ల కింద మిణుగురులు సినిమా చేస్తే ఎవ‌రూ చూడ‌లేదు. దాంతో ట్రెండ్ ఫాలో ఆతూ ముద్దుల సినిమాల‌తో వ‌చ్చాడు. కానీ ఆ కిస్సుల‌కు తోడు కాస్త కంటెంట్ కూడా ఉంటే బాగుండేదనిపించింది. ఎంత‌సేపూ 24 ముద్దులు అంటూ లెక్క‌లు పెట్టుకోవ‌డం, రోజాపూలు ప‌ట్టుకోవ‌డం త‌ప్పిస్తే సినిమాలో క‌థే లేదు. హీరో రోడ్ సైడ్ ఉండే చిన్న‌పిల్ల‌ల కోసం పోరాడుతుంటాడు.. అదే టైమ్ లో ఫ్రెండు ముసుగులో లైంగిక అవసరం తీర్చాలంటాడు. ఈ రెండింటినీ ఎక్క‌డా బ్యాలెన్స్ చేసి చూపించ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు.

24 Kisses movie review
అసలు మొదటగా 24 కిస్సెస్ మూవీ చేస్తే.. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ దర్శకుడేనా ఈ సినిమా తీసింది అనే సందేహం కలగక మానదు. ‘24 కిస్సెస్’ అనే బోల్డ్ టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తిస్తూ.. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియో‌లతో ఈ చిత్రానికి ఫుల్ పబ్లిసిటీ తీసుకురావడంలో సక్సెస్ అయిన దర్శకుడు సినిమాను ప్రజెంట్ చేయడంతో బొక్కబోర్లా పడ్డాడు. కేవలం ముద్దు సీన్లు ఉంటే సినిమాను ఆదరిస్తారని ఆలోచించే మేకర్స్‌కి ఈ సినిమా ఓ హెచ్చరిక లాంటిది. బోల్డ్ కంటెంట్‌ను సరైన రీతిలో ప్రజెంట్ చేయకపోతే రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దానికి పెద్ద ఉదాహరణ ఈ సినిమా.

24 Kisses Movie

అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారో ‘24 కిస్సెస్’ మూవీ శుభం కార్డు పడేవరకూ ప్రేక్షకులు అయోమయంలోనే ఉన్నారు. ఫస్టాప్ మొత్తం హీరో హీరోయిన్ల మధ్య 23 ముద్దుల్ని లెక్కపెడుతూ కథను గాలికి వదిలేసిన దర్శకుడు, సెకండాఫ్‌లో ఏమైనా చెప్తాడా అనుకుంటే మిగిలిన ఆ ఒక్క ముద్దుని పెట్టించేసి శుభం కార్డ్ వేసేశాడు. హీరోతో ప్రేమంటే నమ్మకం లేదని చెప్పిస్తాడు. ఆ ప్రేమే కావాలని హీరోయిన్ వెంట పడేలా చేస్తాడు. పెళ్లిపై నమ్మకం లేదంటాడు. ఆ పెళ్లి కోసం పరితపించేలా చేస్తాడు.. అన్నింటికీ మించి ఈ ప్రపంచానికే పిల్లల్నికనే అర్హత లేదంటాడు. కానీ అలా ఎందుకు మారాడో చెప్పడు.

Rao Ramesh
నటీనటుల విషయానికి వస్తే హీరో అరుణ్ అదిత్ తన పాత్ర పరిధి మేర బాగానే నటించాడు. ముద్దుల్లో హెబ్బాతో పోటీ పడ్డాడు. ప్లే బాయ్‌గా బోల్డ్ సీన్స్ పండించాడు. అయితే కథలో కిస్‌లు తప్ప ఇంకే లేకపోవడంతో హీరో హీరోయిన్లు నటన ముద్దులకే పరిమితం అయ్యింది. ఇక మెంటల్ డాక్టర్‌గా కథను మొత్తం ప్రేక్షకులను వినిపించిన రావు రమేష్ పాత్ర సీరియస్‌గా నడుస్తుంది అనుకుంటే చివర్లో అతన్నీ కమెడియన్‌గా మార్చేశారు. అక్కడక్కడా రావు రమేష్ పంచ్‌లు పేలాయి. హీరోయిన్ తండ్రి పాత్రలో నరేష్ ఆకట్టుకున్నాడు. ఇక హెబ్బాప‌టేల్ మాత్రం అభిన‌యం కంటే ఎక్కువ‌గా అధ‌రాల‌కు ప‌ని చెప్పింది. ఘాటైన ముద్దులతో రెచ్చిపోయింది. దర్శకుడు చెప్పినట్టుగా తన పాత్రకు న్యాయం చేసింది.

Hebah Patel's 24 Kisses Movie
ఇక ఈ చిత్రానికి అస్సామీ సంగీత దర్శకుడు జోయ్ బ‌రువా మంచి సంగీతాన్ని అందించారు. కొన్ని పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వేలేదనిపిస్తుంది. హరి రామ జోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. సినిమాటోగ్రాఫర్ ఉదయ్ గుర్రాల ముద్దు సన్నివేశాల్లో తన కెమెరా పనితనాన్ని చూపించారు. అయితే ఇలాంటి సీన్లు సినిమా నిండా ఉండటంతో ఆయన క్రియేటివిటీ పెద్దగా కనిపించదు. ఆలయం అనిల్ తన కత్తెరకు పనిచెప్పాల్సింది. టెక్నికల్ పరంగా మంచి సాంకేతిక విలువలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేక పోయాడు దర్శకుడు.

నోట్ : కుటుంబంతో, పిల్లలతో కలిసి చూడాలనుకునే వాళ్లు ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది.
తెలుగు బులెట్ పంచ్ లైన్ : ఓవ‌రాల్ గా కిస్సులుతో బాటు కాస్త కంటెంట్ కూడా ఉంటే బాగుండేదేమో..?
తెలుగు బులెట్ రేటింగ్ : 2 / 5