Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్ కోట్ – భావ్ నగర్ హైవేపై ఉన్న రంఘోలా వంతెనపై పెళ్లిబృందంతో వెళ్తున్న ఓ ట్రక్ ప్రమాదానికి గురైంది. ట్రక్ అదుపుతప్పి ఎనిమిది అడుగులు లోతున్న మురికికాల్వలోకి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో 26 మందికి పైగా మృతిచెందారు…చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో సంఘటనాస్థలమంతా భయాందోళన కరంగా మారింది. ట్రక్కు బోల్తా పడడంతో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. మరికొన్ని మృతదేహాలు నాలాలో పడిపోవడంతో క్రేన్ సాయంతో వెలికితీశారు. ట్రక్కులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం సమయం కావడంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. సొంత రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి మోడీ స్పందించారు. రంఘోలా వద్ద జరిగిన ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారందరికీ ట్విట్టర్ లో సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకరం, బాధాకరమని, ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నా ఆకాంక్షని ప్రధాని ట్వీట్ చేశారు.