‘జగదేకవీరుడు అతిలోక సుందరి’కి 30 ఏళ్లు

టాలీవుడ్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, అశ్వీనిదత్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా విడుదలై ఈరోజుతో సరిగ్గా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిజానికి మెగాస్టార్ అతి ముఖ్యమైన సినిమాల్లో మైలు రాళ్లుగా నిలిచినటువంటి సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1990 మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకోవడమే కాకండా అందమైన దృశ్యకావ్యంగా ప్రేక్షకుల మదిలో శాశ్వత కీర్తిని పొందింది. అయితే ఈ సినిమా ఇంత అందంగా రూపుదిద్దుకోవడం వెనుక పలువురి కృషి దాగి ఉంది. అలాగే ఈసినిమాకు సంబందించిన ఎవ్వరికీ తెలియని కొన్ని రహస్యాలను తాజాగా యంగ్ హీరో నాని బయటపెట్టడం విశేషం.

ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోక సుందరి కోసం మెగాస్టార్ చిరంజీవి తన లుక్ ఎలా ఉండాలో తనే నిర్ణయించుకోవడం విశేషం. అదేవిధంగా హీరోయిన్ గా శ్రీదేవి కూడా తన కాస్ట్యూమ్స్ ను తానే డిజైన్ చేయించుకుందని టాక్. అలాగే.. ఈ సినిమా స్టోరీని చాలా పకడ్బంధీగా రూపొందించారు. అందుకోసం ఏకంగా ఆరుగురు రచయితలు కష్టపడ్డారు. అందులో ఇప్పటి టాప్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఒకరు కావడం విశేషం. అలాగే… దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి కూడా రచనా సహకారం అందించారు. చిరంజీవి కూడా ఈసినిమాకు తనదైన సహకారం అందించడం విశేషం. ప్రస్తుతం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ముప్ఫై ఏళ్లు పూర్తి చేసుకోవడం తెలుగు సినిమాకు గర్వకారణంగా చెప్పవచ్చు.