అమెరికాలోని వాషింగ్టన్లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజైన నేడు సాంస్కృతిక ప్రదర్శలు ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుంచి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. కళాకారుల ప్రదర్శనలు అబ్బురపరుస్తున్నాయి.
భారత్కు చెందిన 700 మంది సంప్రదాయ నృత్య కళాకారులు ఇచ్చిన ప్రదర్శన అందరినీ మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా 300 మంది అమెరికన్లు ‘వందే మాతరం’ గీతాన్ని ఆలపించారు. అది వింటుంటే ప్రతి భారతీయుడి మనసు గర్వంతో ఉప్పొంగింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వందే మాతరం.. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో కామెంట్ బాక్సుల్లో హోరెత్తిస్తున్నారు.
మరోవైపు ఈ కార్యక్రమంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’, ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల’ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రసంగించారు. తెలివైన వ్యక్తులు తమ సమయాన్ని.. సమన్వయం చేసుకోవడం, పరస్పర సహకారం, మానవ స్ఫూర్తిని పెంపొందించడంలో గడుపుతారని అన్నారు. పోటీతత్వం అనే భావన లేకుండా, సహకార భావంతో తమ సమయాన్ని గడపడం ఎంతో అవసరం అని సూచించారు.