Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఓ ఇంటర్వ్యూలో తనను అడిగిన 38 ప్రశ్నలకు టకటకా సమాధానాలిచ్చాడు. ఆయన్ను సరిగ్గా 38 ప్రశ్నలు అడగడానికి కారణం గంగూలీ తన కెరీర్ లో టెస్టులు, వన్డేల్లో కలిపి 38 సెంచరీలు చేయడమే. ఈ ప్రశ్నలన్నింటికీ ఒక మాటలో సమాధానం చెప్పాలనేది కండీషన్. కూతురుకు సంబంధించిన ఒక వ్యక్తిగత ప్రశ్నకు తప్ప మిగిలిన ప్రశ్నల్నింటికీ చకచకా బదులిచ్చేశాడు గంగూలీ. ఏరికోరి తెచ్చుకుని… ఆ తర్వాత ఆయన కారణంగానే వివాదాస్పదపరిస్థితుల్లో క్రికెట్ కెరీర్ ను ముగించాల్సి వచ్చిన మాజీ కోచ్ గ్రెగ్ ఛాపల్ గురించి అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా స్టుపిడ్ అని బదులిచ్చాడు సౌరవ్. అలాగే ఇష్టమైన ప్రదేశం లండన్ అన్నాడు. సచిన్ లా బ్యాటింగ్ చేయడం ఇష్టమన్నాడు. క్రికెటర్ కాకపోయి ఉంటే… తమ తండ్రి వ్యాపారం చూసుకునేవాణ్ణని చెప్పాడు. ఐపీఎల్ ను బ్రిలియంట్ గా వర్ణించాడు. రిటైర్మెంట్ చాలా కష్టంగా అనిపించిందని, టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించడం గ్రేటెస్ట్ అఛీవ్ మెంట్ అని అభిప్రాయపడ్డాడు.
తన తండ్రి చనిపోయినప్పుడు చివరిగా ఏడ్చానన్నాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియాతో ఆడిన టెస్ట్ మ్యాచ్ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు. అభిమాన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అని, చివరిగా చూసిన సినిమా పద్మావత్ అని తెలిపాడు. ఇలా అన్ని ప్రశ్నలకు అడిగిన వెంటనే ఒక్క వాక్యంలో ఠకీమని సమాధానం చెప్పిన గంగూలీ… మీ అమ్మాయి ఏ క్రికెటర్ తో అయినా డేట్ చేస్తే మీకిష్టమేనా… అని అడిగిన ప్రశ్నకు మాత్రం బదులిచ్చేందుకు కాస్త టైం తీసుకున్నాడు. ఇంటర్వ్యూ మొదలుపెట్టగానే అడిగిన మొదటి ప్రశ్న ఇదే. ఆ ప్రశ్న వింటూనే బౌన్సర్ స్ట్రయిట్ గా వచ్చిందని నవ్విన గంగూలీ… కొన్ని సెకన్లు ఆలోచించి… తర్వాత సమాధానమిస్తానన్నాడు. అన్ని ప్రశ్నలు పూర్తయిన తర్వాత… యాంకర్ మళ్లీ ఈ ప్రశ్న అడగ్గా ఎస్ అని సమాధానమిచ్చాడు.