చివ‌రిమజిలీలోనూ చెర‌గ‌ని ముద్ర‌…

Satish Kaushik says about Sridevi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పురుషాధిక్య‌త నిండి ఉండే భారత చిత్ర పరిశ్ర‌మ‌లో తొలి లేడీ సూప‌ర్ స్టార్ గా గుర్తింపు పొందిన అతిలోక‌సుంద‌రి శ్రీదేవి చివ‌రి మ‌జిలీలోనూ ఎవ‌రికి ద‌క్క‌ని అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకుంది. శ్రీదేవి అంత్య‌క్రియ‌లు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో జ‌రిగాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో పోలీస్ బ్యాండ్ సంగీతంతో నివాళి అర్పించింది. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌ల్లో ఎవ‌రికీ ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌లేదు. అలాగే శ్రీదేవి అంతిమ‌యాత్ర‌కు జ‌నం వెల్లువ‌లా త‌ర‌లివ‌చ్చారు. మొత్తం 25 వేల‌మంది అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్న‌ట్టు ఓ అంచ‌నా. సెల‌బ్రిటీ స్పోర్ట్స్ క్ల‌బ్ నుంచి అంతిమ‌యాత్ర ప్రారంభం కాగానే… శ్రీదేవి చివ‌రి చూపు కోసం వేలాదిమంది పోటెత్తారు. క‌నుచూపు మేర జ‌న‌సంద్రం క‌నిపించింది. అభిమానులు శోక‌త‌ప్త‌హృద‌యాల‌తో వాహ‌నం వెంట చివ‌రిదాకా న‌డిచారు. 2012లో రాజేశ్ ఖ‌న్నా అంతిమ‌యాత్ర త‌ర్వాత శ్రీదేవి అంతిమ‌యాత్రే పెద్ద‌ద‌ని, హీరోయిన్ల‌లో ఇదే పెద్ద అంతిమ‌యాత్ర‌ని పాత‌త‌రం న‌టులు అంటున్నారు.

బాలీవుడ్ న‌టుడు, నిర్మాత స‌తీశ్ కౌశిక్ కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయం వ్య‌క్తంచేశారు. ఏ వ్య‌క్తి అంతిమ‌యాత్ర‌కూ ఇంతమంది జ‌నాలు రావ‌డం తాను చూడ‌లేద‌ని ఆయ‌న‌ చెప్పారు. శ్రీదేవి మ‌ర‌ణంతో దేశ‌మంతా శోక‌సంద్రంలో మునిగిపోయిందని, ఆమె మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రిపై ప్ర‌భావం చూపింద‌ని అన్నారు. ఆమె మ‌ర‌ణ‌వార్త విని తొలుత తాను న‌మ్మ‌లేక‌పోయాన‌ని, విష‌యాన్ని తెలుసుకుందామ‌ని బోనీకి ఫోన్ చేయ‌గా… పెద్ద ఎత్తున ఏడుపు త‌ప్ప త‌నకు మరేం వినిపించ‌లేద‌ని, తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా బోనీ మాట్లాడ‌లేద‌ని, అలా ఏడుస్తూనే ఉన్నార‌ని తెలిపారు. శ్రీదేవికి మంచి త‌ల్లిగా ఉండ‌డం ఎంతో ఇష్ట‌మైన వ్యాప‌క‌మ‌ని, ఇద్ద‌రు కుమార్తెల విష‌యంలో ఆమె అత్యుత్త‌మ‌మైన త‌ల్ల‌ని నిరూపించుకున్నార‌ని స‌తీశ్ కౌశిక్ అభిప్రాయ‌ప‌డ్డారు.