అరుణాచల్‌ప్రదేశ్‌లో వరుసగా నాలుగు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం మూడు సార్లు భూమి కంపించగా, ఇవాళ తెల్లవారుజామున మరోసారి భూమి కంపించింది. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై వరుసగా 5.6, 3.8, 4.9, మరియు 5.5గా నమోదయ్యాయి. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం 2:52 గంటల సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈస్ట్ కామేంగ్ జిల్లాలో భూమి కంపించింది. ఇక్కడ 5.6గా భూకంప తీవ్రత నమోదైంది. మధ్యాహ్నం 3:04 గంటల సమయంలో 3.8 తీవ్రతతో ఈస్ట్ కామేంగ్ జిల్లాలోనే మరోసారి భూమి కంపించింది. ఇక మూడో ప్రకంపనం.. మధ్యాహ్నం 3:21 గంటల సమయంలో కురుంగ్ కుమేయ్ జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున 4:24 గంటల సమయంలో మరోసారి ఈస్ట్ కామేంగ్ జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూప్రకంపనల నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.