తమిళనాడు-కర్ణాటకల మధ్య కావేరి వివాదం రోజురోజుకు ముదురుతోంది. తమిళనాడుకు కన్నడ సర్కార్ కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రైతు సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్కు మద్దతుగా విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. రవాణ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో కన్నడ రాజ్యం స్తంభించిపోయింది. బంద్ ప్రభావం విమాన రాకపోకలపైనా పడింది. బెంగళూరు విమానాశ్రయంలో ఈరోజు 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బంద్ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసున్నారు. దీంతో సదరు సంస్థలు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు సమాచారం.
కన్నడ నాట ఈరోజు ఉదయం ఆరు నుంచే బంద్ వాతావరణం కనిపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైసూరు బస్టాండ్ ఎదుట రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిక్కమంగళూరులో కొందరు ఆందోళనకారులు పెట్రోల్బంక్లోకి దూసుకొచ్చి బలవంతంగా మూసివేయించే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ అర్ధరాత్రి వరకు బంద్ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు చోట్ల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించడమే గాకుండా.. ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక, కేఆర్ఎస్ ఆనకట్ట, చారిత్రక కట్టడాల వద్ద ప్రభుత్వం భద్రతను పెంచింది.